కోవలంలో ఒక్క బీచ్​ కాదు,మూడు బీచ్​లు.. అన్నీ కలిసిపోయి ఉన్నాయి

కోవలంలో ఒక్క బీచ్​ కాదు,మూడు బీచ్​లు.. అన్నీ కలిసిపోయి ఉన్నాయి

అనగనగా ఒక ఊరు

కేరళ అనగానే ప్రకృతి.. ‘కోవలం’ అనగానే బీచ్​ గుర్తొస్తాయి. అయితే, అక్కడున్నది ఒక్క బీచ్​ కాదు.. మూడు బీచ్​లు. అవన్నీ కలిసిపోయి ఉండడం అక్కడి స్పెషాలిటీ. అవిగాక డామ్​లు, సరస్సులు, చిన్న చిన్న బీచ్​లు ఉండి ఎటు చూసినా దాదాపు నీళ్లే కనిపిస్తాయి. అందుకే దీన్ని ‘బీచ్ విలేజ్’ అని పిలుస్తారు. ఇక్కడ బీచ్​లే కాదు.. చూడ్డానికి మరెన్నో వింతలు, విశేషాలూ ఉన్నాయి. వాటన్నింటి గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ సంగతులు తెలుసుకోవాలంటే.. ఇది చదవాల్సిందే!

కోవలం.. కేరళ రాజధాని తిరువనంతపురం (త్రివేండ్రం)కు దాదాపు15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ‘కోవలం’ అంటే ‘కొబ్బరి చెట్ల తోపు’ అని అర్థం. కేరళలో కొబ్బరి చెట్లు ఎక్కువ. అయితే, అందులోనూ ప్రత్యేకించి ఈ ఊరి పేరునే కొబ్బరి చెట్ల తోపుగా మార్చారంటే.. కోవలంలో ఎన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒక పక్క స్వచ్ఛమైన అలల​ అందాలు, మరోపక్క ప్రకృతి సౌందర్యం, బీచ్​ దగ్గర సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో కలిగే అనుభూతి.. మాటల్లో చెప్పలేనివి. అందుకే ఈ ప్రదేశాన్ని ‘భూతల స్వర్గం’ అంటారు. 

అలా ఫేమస్ అయింది

ఈ ప్రదేశం రోజు రోజుకూ పాపులర్​ అవుతుండడంతో చరిత్రకారులు దీని మీద దృష్టిపెట్టారు. ఈ ఊరి చరిత్రను వెలికితీశారు. ట్రావెన్​కోర్ పాలకురాలైన మహారాణి సేతు లక్ష్మీ బాయికి ఈ ప్రదేశం చాలా బాగా నచ్చింది. దాంతో 1920లో ఆమె కోసం ఇక్కడ బీచ్ రిసార్ట్​ కట్టించుకుంది. అది ఇప్పటికీ కోవలం బీచ్​లో ఉంది. దాని పేరు ‘హల్సియోన్ కోట’. ఆమె తర్వాత మహారాణి మేనల్లుడు ట్రావెన్​కోర్​ని పాలించాడు. అప్పుడు ఆయన తరచూ ఈ బీచ్​ టౌన్​కు వచ్చివెళ్లేవాడు. దాంతో ఈ ప్రదేశం కళాపోషణకు నిలయంగా ఉండేది. 

ఆ తర్వాత ట్రావెన్​కోర్​కి వెళ్లే యూరోపియన్​ గెస్ట్​లు ఈ ఊరికి రావడం మొదలైంది. అలా ఈ ఊరు మరింత ఫేమస్ అయింది.1930లో ఈ ఊరు పాపులర్ బీచ్ డెస్టినేషన్​గా మారింది.1970లో ప్రపంచ చరిత్రలో కోవలం చెప్పుకోదగ్గ స్థాయిలో నిలిచింది. దాంతో హిప్పీలు ఈ ఊరిని తమ కార్యకలాపాల కోసం కేంద్రంగా మార్చాలని నిర్ణయించుకున్నారు. అలా కోవలంకు హిప్పీల రాక విపరీతంగా పెరిగిపోయింది. కోవలం నుంచి శ్రీలంకలోని సెలాన్​కు సముద్ర ప్రయాణం చేసేవాళ్లు. కొంతకాలానికి ఫిషింగ్ విలేజ్​ కాస్తా టూరిస్ట్​ హబ్​గా పేరుగాంచింది. ఈరోజుకి కూడా యూరప్​, ఇజ్రాయెల్​ నుంచి టూరిస్ట్​లు రెగ్యులర్​గా వస్తుంటారు ఇక్కడికి. 

సిటీ ఆఫ్ బీచెస్

కోవలంలో ప్రధానంగా మూడు బీచ్​లు ఉన్నాయి. వాటి పేర్లు లైట్​హౌస్, హవా, సముద్ర. వాటిలో పెద్దది లైట్​హౌస్ బీచ్​. ఇక్కడ 35 మీటర్ల ఎత్తులో కురుంకల్​ అనే చిన్న కొండ మీద లైట్​ హౌస్ ఉంది. దీన్ని విళింజిమ్ లైట్​హౌస్ అని కూడా అంటారు. ఎక్కువమంది టూరిస్ట్​లు ఇక్కడికే వెళ్తుంటారు.

రెండో పెద్ద బీచ్ హవా.. ఇక్కడ ఎక్కువగా యూరోపియన్స్ సన్​బాత్​ చేసేవాళ్లు. మనదేశంలో టాప్​లెస్​ సన్​బాత్​ చేసే బీచ్​లలో ఇదే మొదటిది. ప్రస్తుతం అలాంటి సన్​బాత్​లను ఇక్కడ బ్యాన్​ చేశారు. 

ఉత్తరభాగంలో ఉన్న సముద్ర బీచ్ మూడోది. ఇక్కడికి టూరిస్ట్​లు ఎక్కువగా రారు. కారణం.. జాలర్లు చేపలు పట్టడమే. ఈ మూడు బీచ్​లే కాదు.. కోవలంలో అశోక అనే మరో బీచ్​ కూడా ఉంది. అయితే, ఇది కూడా సముద్ర బీచ్​లాగే. ఇక్కడ కూడా టూరిస్ట్​లు ఎక్కువగా కనిపించరు. 

ఆ టైమింగ్స్​ బెస్ట్

బీచ్​లకి వెళ్లడానికి సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయ సమయాలు బెస్ట్​ టైం. ఆ టైంలో అక్కడ ఉంటే కలిగే అనుభూతి జీవితాంతం గుర్తుండిపోతుంది. ఈ మూడు బీచ్​లు దాదాపు17 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉంటాయి. వీటిని వేరుచేస్తూ మధ్యమధ్యలో రాళ్ల గుట్టలు ఉంటాయి. అయితే, ఇవి ఎప్పుడూ నీళ్లలో తడుస్తూ ఉండడం వల్ల అడుగేస్తే జారిపోతుంటాయి. అందుకే ఒక బీచ్​ నుంచి ఇంకో బీచ్​కి గుట్టల మీద నుంచి వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అయితే, ఈ బీచ్​లలో ఈత కొట్టడం సరదాగా ఉంటుంది. శీతాకాలంలో టూర్​, ఈత సరదా రెండూ కలిపి చేయడం కష్టమేమో అనిపించొచ్చు. కానీ, ఈ బీచ్​ల్లో చలికాలం​లో కూడా వెచ్చగానే ఉంటుంది. అందుకే ఇది వింటర్​ టూర్​కి బెస్ట్​ ప్లేస్.  

మరో ఇంట్రెస్టింగ్​ విషయం ఏంటంటే.. మామూలుగా బీచ్​లలో గోధుమ రంగు ఇసుక కనిపిస్తుంది. కానీ, ఈ బీచ్​లో నలుపు రంగులో ఉండే ఇసుక కనిపిస్తుంది. ఎందుకంటే.. అందులో మోనజైట్, ఇల్మెనైట్ అనే పారామ్యాగ్నెటిక్​ మినరల్స్ ఉంటాయి. మోనజైట్ కాస్త కాషాయ రంగులో ఉంటే, ఇల్మెనైట్ మాత్రం నలుపు రంగులో ఉంటుంది. అందువల్లే ఇసుక నలుపు రంగులో కనిపిస్తుంది.

వేళాయని సరస్సు

ఇది త్రివేండ్రం నుంచి తొమ్మిది కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ మంచినీటి సరస్సు కూడా టూరిస్ట్​ అట్రాక్షన్​లో భాగమే. ఈ సరస్సుకు ఒక కథ ఉంది. అది సాధువు, బిచ్చగాడి కథ. ధ్యానం చేస్తున్న సాధువు దగ్గరికి దాహంతో ఉన్న బిచ్చగాడు వెళ్తాడు. ఆ సాధువు బిచ్చగాడికి సాయం చేయాలనుకున్నాడు. కానీ, సాధువు దగ్గర ఉన్న పాత్రలో కొన్ని నీటి చుక్కలే ఉంటాయి.

దాంతో సాధువు అరచేతిలోకి కొన్ని నీళ్లు తీసుకుని ప్రార్థన చేసి, నీళ్లను విసురుతాడు. నీటి చుక్కలు పడిన ప్రదేశం అందమైన సరస్సులా మారిపోయింది అని చెప్పుకుంటారు. ఈ సరస్సులో ఓనం పండుగ సందర్భంగా ‘స్కేట్​ బోట్ రేసింగ్’ జరుగుతుంది. వలియతుర పీర్ ఈ పీర్​ 703 అడుగుల ఎత్తులో కట్టారు. సాయంత్రం వెళ్తే రాత్రివరకు అక్కడి నుంచి కదలాలి అనిపించదు. అంత అద్భుతమైన, ప్రశాంతమైన ప్లేస్​ అది. 

బెస్ట్​ ఎక్స్​పీరియెన్సెస్

కోవలంలో తప్పకుండా ఎక్స్​పీరియెన్స్ చేయాల్సినవి.. రైడ్ కటమరన్ రైడ్, స్కూబా డైవింగ్, పారాసెయిలింగ్, కయాకింగ్​, సీ– సర్ఫింగ్​, స్పీడ్​ బోట్​ సఫారీ. ఇంకా చూడ్డానికి విళింజమ్ మెరైన్ అక్వేరియం, ఆర్టిఫిషియల్ ఆఫ్​షోర్​ కోరల్ రీఫ్, కోవలం ఆర్ట్ గ్యాలరీ, హెల్సియోన్ కోట, నెయ్యర్ డ్యాం, అరువిక్కర డ్యాం, తిరువల్లమ్​ పరశురామ టెంపుల్, విళింజమ్ రాక్ కట్​ కేవ్​ టెంపుల్స్​ కనువిందు చేస్తాయి. టూరిస్ట్​ల కోసం బీచ్​ రిసార్ట్​లు చాలా ఉంటాయి. తినడానికి ఫిష్​ వెరైటీలు చాలా దొరుకుతాయి. త్రివేండ్రం నుంచి కోవలంకి రోడ్, రైలు, విమానంలో ఎలాగైనా వెళ్లొచ్చు. నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఇక్కడికి వెళ్లడం బెస్ట్ టైం. 

హల్సియోన్ కోట

దీన్ని ‘కోవలం కోట’ అని కూడా పిలుస్తారు. ఇది ఇప్పుడు లగ్జరీ డీలక్స్ హోటల్. ఈ కోటను1932లో మళ్లీ కట్టించారు. అప్పుడు బిల్డర్ల ఫ్యామిలీ రిట్రీట్​గా మారింది. ఆ తర్వాత కొన్ని దశాబ్దాలకు 1964లో దీన్ని లగ్జరీ హోటల్​గా మార్చారు.