కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పూర్తి

 కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పూర్తి
  • కోర్టు ఆదేశాలతో ఫలితం పెండింగ్
  • ఎన్నిక ప్రక్రియ మొత్తం వీడియో చిత్రీకరణ
  • కోర్టు పరిధిలో విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఓటు హక్కు

అమరావతి: కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ ఎన్నిక పూర్తయింది.  హైకోర్టు ఆదేశాలతో బుధవారం కొండపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు తుది ఫలితాలను ప్రకటించలేదు. ఎన్నికల ప్రక్రియను అధికారులు కోర్టుకు సమర్పించనున్నారు. వివాదాల నేపధ్యంలో మొత్తం ఎన్నిక ప్రక్రియను వీడియో తీశారు. టీడీపీ తరఫున చెన్నుబోయిన చిట్టిబాబు, వైసీపీ తరఫున జోగు రాము పోటీ చేశారు. ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌, విజయవాడ ఎంపీ కేశినేని నాని ఓటు వేశారు. 
29 మంది సభ్యులున్న ఈ మున్సిపాలిటీలో తెలుగుదేశం, వైసీపీలకు చెరి 14 వార్డులు చొప్పున వచ్చాయి. ఒకరు ఇండిపెండెంట్‌గా గెలిచారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థి అనూహ్యంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించారు. దీంతో వైసీపీ అభ్యర్థికి 15, టీడీపీ అభ్యర్థికి 16 ఓట్లు పడ్డాయి. కేశినేని నాని ఓటు వ్యవహారం ఇప్పటికే కోర్టులో ఉన్నందున... తుది ఫలితాలను కోర్టు ప్రకటించనుంది. కేశినేనికి ఓటు ఇవ్వడం చట్టబద్ధమైతే.. టీడీపీ అభ్యర్థి గెలుస్తారు. లేదంటూ ఇద్దరికీ సమాన ఓట్లు వస్తాయి. దీంతో ఇపుడు అందరి దృష్టికి కోర్టు తీర్పుపై పడింది.
కోర్టు ఆదేశాలతో వీడియో చిత్రీకరణ మధ్య ఎన్నిక
కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వ్యవహారం ఉద్రిక్తత సృష్టించింది. నిన్న మంగళవారం చైర్మన్ ఎన్నిక కోసం ఎన్నికల అధికారి సమావేశం నిర్వహించగా.. ఎమ్మెల్యేల అండతో వైసీపీ సభ్యుల ఆందోళనతో ఉద్రిక్తత చెలరేగింది. కోరం ఉన్నా ఎన్నిక జరపకపోవడంపై తెలుగుదేశం పార్టీ సభ్యులు సైతం నిరసనకు దిగారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎన్నికల అధికారితో వాగ్వాదానికి దిగారు. ఎన్నిక నిర్వహించాలంటూ కోరినా అధికారులు స్పందిచకపోవడంతో ఆయన సాయంత్రం 6 గంటల వరకు వేచి చూశారు. చివరకు కోర్టు ఆదేశాలతో బుధవారం ఉదయమే ఎన్నిక నిర్వహించారు. ఉద్రిక్తతను నివారించేందుకు వీడియో చిత్రీకరించడంతో ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.