సెకెండ్ వేవ్‌‌ నుంచి బయటపడతాం

సెకెండ్ వేవ్‌‌ నుంచి బయటపడతాం

ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది
ఏడీబీ ఏడాదికి 4 బిలియన్ డాలర్లు అప్పుగా ఇవ్వాలి
ప్రైవేట్‌‌ సెక్టార్‌‌‌‌కు 1.5 బిలియన్ డాలర్లివ్వాలి : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌


న్యూఢిల్లీ: కరోనా మొదటి వేవ్‌‌ నుంచి రికవరీ అవుతున్న దశలో  కరోనా సెకెండ్‌‌ వేవ్‌‌ ప్రారంభమయ్యిందని, దేశ ఆర్థిక వ్యవస్థపై నెగిటివ్‌‌ ప్రభావం చూపుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల నుంచి బయటపడతామనే ధీమాను వ్యక్తం చేశారు. హెల్త్‌‌ సిస్టమ్‌‌పై ప్రభుత్వం ఫోకస్‌‌ పెట్టిందని, కరోనా సోకిన వారిని గుర్తించి ట్రీట్‌‌మెంట్ ఇవ్వడంతో పాటు ఆర్థిక వ్యవస్థపై వైరస్ ప్రభావాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. లక్షల మంది కరోనా సెకెండ్‌‌ వేవ్‌‌ ప్రభావంతో భాదపడుతున్నారని, హెల్త్‌‌ సిస్టమ్‌‌పై ఒత్తిడి పెరుగుతోందని వర్చువల్‌‌గా జరిగిన ఏసియన్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ బ్యాంక్‌‌ (ఏడీబీ) 54 వ యాన్యువల్‌‌ మీటింగ్‌‌లో సీతారామన్ పేర్కొన్నారు.  ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియాకు సాయంగా ఉన్న దేశాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. దేశంలో వ్యాక్సిన్ తయారీ కెపాసిటీని పెంచుతున్నాం. మరిన్ని కరోనా వ్యాక్సిన్లకు అనుమతులిస్తున్నాం. రా మెటీరియల్స్ అందుబాటులో ఉంటే దేశ అవసరాలకు సరిపడేంత వ్యాక్సిన్‌‌ను తయారు చేయగలుగుతాం. ప్రపంచ వ్యాక్సిన్‌‌ అవసరాలను కూడా చేరుకోగలుగుతామనే నమ్మకం ఉంది.’ అని తెలిపారు.  
అప్పు పెంచండి..
దేశంలో పేదరికాన్ని గత కొన్నేళ్ల నుంచి తగ్గిస్తూ వస్తున్నామని, కానీ, కరోనా వలన 2020 లో 7.8 కోట్ల మంది తిరిగి పేదరికంలోకి వెళ్లిపోయారని సీతారామన్‌‌ పేర్కొన్నారు. ఏసియా దేశాలకు సపోర్ట్‌‌గా ఉంటున్నందుకు ఏడీబీని సీతారామన్‌‌ అభినందించారు. ఆర్థిక వ్యవస్థలపై కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు కోవిడ్ రెస్పాన్స్‌‌ ప్రోగ్రామ్‌‌ను ఏడీబీ లాంచ్ చేసింది. ఆసియా దేశాలకు లోన్లిస్తోంది. ఇండియాకు ఇచ్చే అప్పులు పెంచాలని సీతారామన్‌‌ ఏడీబీని కోరారు. ఏడాదికి 4 బిలియన్ డాలర్లను అప్పుగా తీసుకునే సామర్ధ్యం ప్రభుత్వానికి ఉందని, మరో 1.5 బిలియన్‌‌ డాలర్లను దేశంలోని ప్రైవేట్‌‌ సెక్టార్‌‌‌‌కు ఇవ్వాలని కోరారు. గత ఐదేళ్లలో ఏడీబీ ప్రభుత్వానికి ఇచ్చిన అప్పులు సగటున ఏడాదికి  700 మిలియన్ డాలర్లేనని, అదే ప్రైవేట్ సెక్టార్‌‌‌‌కు ఇచ్చిన అప్పులు మరీ తక్కువగా ఉన్నాయని తెలిపారు.