సెల్ ఫోన్ సిగ్నల్ కోసం చెట్టెక్కిన పిల్లలు.. పిడుగుపడి ఒకరి మృతి

సెల్ ఫోన్ సిగ్నల్ కోసం చెట్టెక్కిన పిల్లలు.. పిడుగుపడి ఒకరి మృతి

ముంబయి: సెల్ ఫోన్ నెట్ వర్క్ సరిగా పనిచేయడం లేదని నలుగురు పిల్లలు చెట్టెక్కారు. ఇంతలోనే అదే చెట్టుపై పిడుగుపడడంతో రవీన్ కోర్డా(15) అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మిగిలిన ముగ్గురు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. పాల్ఘర్ జిల్లాలోనా ధాను తాలుకా పరిధిలోని మన్కర్ పడ గ్రామం వద్ద సోమవారం సాయంత్రం జరిగిందీ ఘటన. ఈ ప్రాంతంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం సాయంత్రం నలుగురు పిల్లలు తమ ఇంట్లోని ఒక ఫోన్ తీసుకుని మొబైల్ నెట్ వర్క్ పనిచేయకపోవడంతో సమీపంలోని చెట్టెక్కారు. మొబైల్ తెచ్చిన రవీన్ కోర్డా(15)కు తోడుగా మరో ముగ్గురు చెట్టెక్కారు. అయితే అదే సమయంలో పెద్ద శబ్దంతో ఉరుముతూ వీరెక్కిన చెట్టుపై పిడుగుపడింది. మొబైల్ ఫోన్ పట్టుకున్న రవీన్ కోర్డా.. నల్లగా మాడిమసై చనిపోగా.. మిగిలిన ముగ్గురు పిల్లలు కరెంట్ షాక్ గురైనట్లు చెట్టుపై నుంచి పడిపోయారు. వీరికి గాయాలు కావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. 
పిల్లలు చెట్టెక్కిన సమయంలో పిడుగు పడిన విషయ తెలిసి మంగళవారం ఉదయమే దహను తాలుకా తాహశీల్దార్ రాహుల్ సారంగ్ గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. గ్రామస్తుల నుండి వాంగ్మూలం తీసుకున్నారు. మొబైల్ సిగ్నల్ కోసం పిల్లలు చెట్టెక్కిన సమయంలోనే పిడుగు పడడంతో ప్రమాదం జరిగిందని ఆయన ధృవీకరించారు.