లిక్కర్ లక్కు ఎవరికో నేడే వైన్స్ షాప్ లకు డ్రా

లిక్కర్ లక్కు ఎవరికో నేడే వైన్స్ షాప్ లకు డ్రా

నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మద్యం దుకాణాల దరఖాస్తుదారుల ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. సోమవారం మద్యం దుకాణాలకు డ్రా తీయనున్నారు. నల్గొండ జిల్లాలోని వైన్స్‌ షాపులకు హైదరాబాద్ రోడ్ లోని లక్ష్మీ గార్డెన్స్ లో కలెక్టర్‌ ఇలా త్రిపాఠి,  ఎక్సైజ్‌సూపరింటెండెంట్‌సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రా పద్ధతిలో షాపులను కేటాయించనున్నారు. 

సూర్యాపేట జిల్లాలో కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ లక్ష్మ నాయక్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో రాయగిరిలోని సోమ రాధాకృష్ణ ఫంక్షన్ హాల్ లో కలెక్టర్ హనుమంతరావు ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు మొదటి డ్రా తీయనున్నట్లు అధికారులు తెలిపారు. 

కొత్త పాలసీతో  లిక్కర్​ షాపుల పై గుత్తాధిపత్యానికి చెక్ 

లిక్కర్​ షాపులపైనా గుత్తాధిపత్యానికి ఎక్సైజ్​శాఖ అడ్డుకట్ట వేసింది. 2025 –- 27కు ప్రకటించిన కొత్త పాలసీలో కొన్ని కీలమైన మార్పులు చేసింది.  ముఖ్యంగా మడిగెల దందాను నియంత్రించి, గ్రామాల్లో బెల్టుషాపులను కట్టడి చేసేందుకు వైన్స్​షాపుల పరిధిని పెంచింది. దీనివల్ల గ్రామాల్లో లిక్కర్​ సేల్స్​పెరగడమే గాక, మడిగెలను గుప్పిట్లో పెట్టుకుని రాజకీయం చేస్తున్న వ్యాపారుల ఆగడాలకు చెక్​పెట్టొచ్చని కొత్త ప్లాన్​ అమల్లోకి తెచ్చింది. జనరల్ షాపులతో పోలిస్తే, రిజర్వేషన్​ షాపులకు అప్లికేషన్స్​ తక్కువగా వస్తున్నాయి. 2023 –- 25 లిక్కర్​ పాలసీలో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు చేసినట్టు తెలుస్తోంది. 

కొత్త పాలసీతో వ్యాపారులు దిగి రావాల్సిందే 

కొత్త పాలసీ అమల్లోకి వస్తే సర్కార్‌‌కు భారీ ఆదాయం వస్తుందని భావిస్తోంది.  దీని కోసం నల్లగొండ, మిర్యాలగూడ మున్సిపాలిటీల్లో వార్డులను ఎత్తేశారు. గతంలో వార్డుల ప్రకారం గెజిట్​రిలీజ్​అయ్యేది. కానీ అన్ని షాపులకు కలిపి ఒకటే టెండర్​ పిలిచారు. దాంతో వ్యాపారులు మున్సిపాలిటీల లిమిట్స్​లో ఎక్కడైనా షాపులు పెట్టుకోవచ్చు. 2023లో కంచనపల్లి షాపునకు 97 అప్లికేషన్స్​వచ్చాయి. కానీ ఇప్పుడు మున్సిపాలిటీలో షాపు వచ్చిన వారు కంచనపల్లిలో కూడా పెట్టొచ్చు.

 దాంతో కంచనపల్లి షాపు పైన వ్యాపారుల గుత్తాధిపత్యానికి చెక్​ పడనుంది. అంగడిపేటలో మూడు, పీఏపల్లిలో ఉన్న ఒక షాపును ఈ రెండు చోట్ల ఎక్కడైనా పెట్టొచ్చు. కట్టంగూరు మండలంలోని అయిటిపాముల, కట్టంగూరు షాపులను ఎక్కడైనా పెట్టుకునే వెసులుబాటు కల్పించారు. సూర్యాపేట జిల్లాలో గరిడేపల్లి, కీతవారిగూడెంలో మూడు షాపులు ఉన్నాయి. పాత పాలసీ ప్రకారం ఈ రెండు గ్రామాల పరిధిలోనే షాపులు పెట్టాలి. కానీ ఇప్పుడు గరిడేపల్లితోపాటు పొనుగోడు, కల్మల్​చెరువులో ఎక్కడైనా పెట్టొచ్చు.

 అదే విధంగా కీతవారిగూడెం షాపును రాయినిగూడెంలో కూడా పెట్టొచ్చు. మఠంపల్లి  మండలంలోని మూడు షాపులను నాలుగు గ్రామాల్లో ఎక్కడైనా పెట్టుకునే వెసులుబాటు కల్పించారు. యాత వాకిళ్ల, మట్టపల్లి, పెదవీడు, వరదాపురం గ్రామాల్లో ఎక్కడైన పెట్టొచ్చు. మోతె మండలంలోని ఎస్సీలకు రిజర్వు చేసిన షాపుకు 33, గౌడలకు రిజర్వు చేసిన షాపుకు 45 అప్లికేషన్స్​మాత్రమే గతంలో వచ్చాయి. 

ఇదే మండలంలోని ఉర్లుగొండ షాపు జనరల్‌కు రిజర్వు కాగా, 64 ఆప్లికేషన్స్​వచ్చాయి. మోతె నుంచి ఉర్లుగొండ సుమారు 20 కిలో మీటర్లు ఉండడంతో ఈసారి మోతె మండలంలోని మూడుషాపులు ఉర్లుగొండలో పెట్టుకునే అవకాశం కల్పించారు.  మేళ్లచెర్వు మండలంలో మూడు షాపులు అక్కడే ఉండేవి.  దీనివల్ల రామాపురంలో కల్తీ మద్యం తయారీకి ఆస్కారం ఏర్పడింది.  దాంతో మేళ్లచెర్వులోని మూడు షాపులను రామాపురంలో కూడా పెట్టుకునే వెసులుబాటు కల్పించారు. గరిడేపల్లి నుంచి పొనుగోడుకు 15 కిలోమీటర్లు కాబట్టి గరిడేపల్లి షాపును పొనుగోడులో పెట్టడం వల్ల చుట్టుపక్కల గ్రామాలకు కలిసొస్తుంది. దాంతో లిక్కర్​ బిజినెస్​ పెరుగుతుంది.

ఎక్కడెక్కడ ఎన్ని షాపులంటే..

నల్గొండ జిల్లాలో 154 మద్యం షాపులకు 4906 అప్లికేషన్లు వచ్చాయి.  అత్యధికంగా కనగల్ మండలంలోని దర్వేశ్ పురం షాపునకు 154 దరఖాస్తులు వచ్చాయి. సూర్యాపేటలో 93 షాపుల కు 2,487, యాదాద్రి జిల్లాలో 82 షాపులకు 2,598 అప్లికేషన్స్​వచ్చాయి. సూర్యాపేటతో పోలిస్తే యాదాద్రి జిల్లాలోనే అప్లికేషన్స్​ఎక్కువ రావడం గమనార్హం. నల్గొండ జిల్లాలో మొత్తం 154  షాపులకు గాను 52  షాప్‌లు రిజర్వు షాప్‌లు కాగా ఇందులో ఎస్సీ14, ఎస్టీ 4, గౌడ్  34 గా కేటాయించారు. సూర్యాపేట జిల్లాలో  93 షాపులకు గాను  40  షాప్‌లు రిజర్వు షాప్‌లు కాగా ఇందులో ఎస్సీ 10, ఎస్టీ 03, గౌడ్ 27 గా కేటాయించారు. యాదాద్రి జిల్లాలో 82 షాపులకు గాను 21 గౌడ్, 07 ఎస్సీ, 01 ఎస్టీ లకు కేటాయించారు.