​ఐకేపీ సభ్యుల పేరుతో వేరే వాళ్లకు లోన్లు

​ఐకేపీ సభ్యుల పేరుతో వేరే వాళ్లకు లోన్లు
  • లక్షలకు లక్షలు ఎగ్గొడుతున్న వైనం

భద్రాచలం, వెలుగు: మహిళా సాధికారతకు సర్కారు కోట్ల రూపాయలు విడుదల చేస్తుంటే వాటిని ఆఫీసర్లు, పెద్దోళ్లు కలిసి మింగేస్తున్నారు. భద్రాచలంలో తాజాగా ఓ టీఆర్‍ఎస్​ మహిళా లీడర్​ సుమారు రూ.5 లక్షలు బ్యాంకు లింకేజీ, రూ.1.50 లక్షల స్త్రీనిధి లోన్​ తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇది తమకు తెలియదని గ్రూపు సభ్యులు చెబుతుండగా.. రెండేళ్లుగా లోన్​ చెల్లించడం లేదని ఐకేపీ(ఇందిరా క్రాంతి పథం) ఆఫీసర్లు అంటున్నారు. దీంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. గతంలో కూడా భద్రాచలం టౌన్‍లో ఓ ఐకేపీ సీసీ గ్రామ సమాఖ్యల పేరిట రుణాలు దారి మళ్లించి వాటిని వడ్డీకి తిప్పాడు. అతను హత్యకు గురి కావడంతో ఈ స్వాహా పర్వం బయటపడింది. 
ఇతను సుమారు రూ.50 లక్షలు తీసుకున్నాడని, తీసుకున్న వాటితో పాటు తాము కట్టిన డబ్బులను బ్యాంకుకు చెల్లించలేదని సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇక ఐటీడీఏ రోడ్డులో మైక్రో ఫైనాన్స్ వేధింపులకు సూసైడ్​ చేసుకున్న ఓ గ్రూపు నాయకురాలు కూడా సభ్యుల పేరిట రుణాలు తీసుకున్నారు. ఆ బకాయిలు కూడా అలాగే ఉన్నాయి. ప్రస్తుతం లక్షలాది రూపాయల బకాయిలు భద్రాచలం టౌన్‍లో పేరుకుపోయాయి. 
గ్రామ దీపికలే కీ రోల్‍
ఐకేపీలో మహిళలకు లోన్ల మంజూరులో గ్రామదీపికలే కీ రోల్​ పోషిస్తున్నారు. వారికి తెలిసే స్వాహా పర్వం సాగుతోంది. టౌన్‍లో ఓ గ్రూపులో సభ్యులు తప్పుకున్నారు. కానీ ఆ గ్రూపులో కొత్త సభ్యులను చేర్పించి ఓ మహిళా టీఆర్‍ఎస్ లీడర్​ బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి రుణాలు సుమారు రూ.6.50 లక్షలు తీసుకున్నారు. ఆ సభ్యులకు కూడా రుణం వచ్చిన విషయం తెలియదు. రెండేళ్లుగా మీటింగ్‍లు లేవు. డబ్బులు కూడా రికవరీ కాకపోవడంతో ఐకేపీ ఆఫీసర్లు రంగంలోకి దిగేసరికి అసలు విషయం బయటపడింది. ఇదంతా గ్రామదీపికలకు తెలిసే జరుగుతోందనే ఆరోపణలున్నాయి. రుణాలు మంజూరైతే వీరికి కమీషన్​ వస్తుంది. కమీషన్ల కక్కుర్తికి ఆశపడి కొందరు దొడ్డిదారిన పెద్దోళ్లకు లోన్లు ఇప్పిస్తున్నారు. అలాంటి వారు కట్టకుండా పేరుకుపోయిన బకాయిలు రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఉన్నాయి.
బకాయిలు వాస్తవమే
భద్రాచలం టౌన్​లో ఒక గ్రూపు రూ.6.50 లక్షల బకాయి ఉంది. రెండేళ్లుగా లోన్లు చెల్లించడం లేదు. మేం అడిగితే వారి పేరు మీద వేరే వారు లోన్లు తీసుకున్నారని చెబుతున్నారు. సభ్యులకు తెలియకుండానే రుణం వెళ్లింది. త్వరలో చెల్లించేందుకు వారితో మాట్లాడుతున్నాం.- రాంబాబు, సీసీ, భద్రాచలం