3 నిమిషాల్లోనే పాస్.. కొత్త ఆదాయ పన్ను బిల్లుకు లోక్ సభ ఆమోదం

3 నిమిషాల్లోనే పాస్.. కొత్త ఆదాయ పన్ను బిల్లుకు లోక్ సభ ఆమోదం
  • వాయిస్ ఓట్ తో అప్రూవల్.. రాజ్యసభకు బిల్లు

న్యూఢిల్లీ: కొత్త ఆదాయ పన్ను బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. కేవలం 3 నిమిషాల్లోనే వాయిస్ ఓట్ తో బిల్లు పాసయింది. ‘ది ఇన్ కం ట్యాక్స్  బిల్ 2025’ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  సోమవారం లోక్ సభలో ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష ఎంపీల గందరగోళం మధ్య ఎలాంటి చర్చ జరగకుండానే బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. తర్వాత బిల్లును రాజ్యసభకు పంపించారు. అక్కడ కూడా ఆమోదం పొందాక రాష్ట్రపతికి పంపుతారు. రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేస్తే, బిల్లు చట్టరూపం దాలుస్తుంది. 

దీంతో కొత్త ఆదాయ పన్ను చట్టం అమల్లోకి వస్తుంది. కాగా.. 6 దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఆదాయ పన్ను చట్టం 1961 స్థానంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త ఆదాయ పన్ను బిల్లును లోక్ సభలో నిర్మలా సీతారామన్  ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో బిల్లును సెలెక్ట్  కమిటీకి పంపారు. పార్లమెంటరీ ప్యానెల్  చేసిన సిఫారసులను బిల్లులో చేర్చి అప్ డేటెడ్  వర్షన్ ను నిర్మల సోమవారం లోక్ సభలో ప్రవేశపెట్టారు. బైజయంత్  పాండా సారథ్యంలో 31 మంది సభ్యులతో కూడిన సెలక్షన్  కమిటీ ఈ బిల్లుకు పలు సిఫారసులు చేసింది. అలాగే, ఈ ఏడాది ఫిబ్రవరిలో లోక్ సభలో ప్రవేశపెట్టిన ఇన్ కం ట్యాక్స్  బిల్లు 2025ను ఈ నెల 8న నిర్మల ఉపసంహరించారు. దాని స్థానంలో అప్ డేటెడ్  వర్షన్  (సవరించిన) బిల్లును సభ ముందు ఉంచారు.

ఏమున్నాయ్  కొత్త బిల్లులో?

అసెస్ మెంట్  ఇయర్, ప్రీవియస్  ఇయర్  అని గందరగోళానికి గురిచేసే పదాలు కొత్త బిల్లులో ఉండవు. వాటికి బదులుగా ‘ట్యాక్స్ ఇయర్’ అని ఉంటుంది. రిటర్నులు దాఖలు చేయడంలో ఆలస్యమైనా.. టీడీఎస్  రిఫండ్ ను క్లెయిమ్  చేసుకోవడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. అలాగే, విద్యకు సంబంధించిన లిబరలైజ్డ్  రెమిటాన్స్  స్కీం (ఎల్ఆర్ఎస్) పై టీసీఎస్  ఉండదు. ప్రస్తుతం ఉన్న ట్యాక్స్  స్లాబ్స్, రేట్లు యథాతథంగా ఉంటాయి.