బాలుడి హత్య కేసులో.. దోషికి ఉరిశిక్ష

బాలుడి హత్య కేసులో.. దోషికి ఉరిశిక్ష
  • మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు
  • న్యాయ దేవతకు బాలుడి తల్లిదండ్రుల పాలాభిషేకం

మహబూబాబాద్, వెలుగు :  మూడేండ్ల కింద జరిగిన బాలుడి కిడ్నాప్,​ హత్య కేసులో దోషికి ఉరిశిక్ష విధిస్తూ మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. పట్టణానికి చెందిన దీక్షిత్ రెడ్డి(9) అనే బాలుడిని మంద సాగర్​2020లో కిడ్నాప్ చేసి హత్య చేశాడు. మూడేండ్లు విచారణ కొనసాగిన ఈ కేసులో జిల్లా కోర్టు జడ్జి పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్ ఉరిశిక్ష ఖరారు చేస్తూ శుక్రవారం తీర్పు వెలువరించారు. 

టెక్నికల్ ఎవిడెన్స్​తో తేలిన కేసు

సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆశతో మహబూబాబాద్ శివారులోని శనిగపురానికి చెందిన మంద సాగర్ అదే గ్రామానికి చెందిన కుసుమ వసంత, రంజిత్ రెడ్డి కుమారుడు దీక్షిత్ రెడ్డి(9) ని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశాడు. 2020 అక్టోబర్ 18న కాలనీలో పిల్లలతో కుసుమ దీక్షిత్ రెడ్డి (సన్నీ) ఆడుకుంటుండగా సాగర్ పెట్రోల్ బంక్​కు వెళ్దామని చెప్పి బైక్​పై తీసుకెళ్లాడు. కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి దగ్గరున్న దానమయ్య గుట్టపైకి తీసుకెళ్లి బాలుడికి నిద్ర మాత్రలు కలిసిన నీళ్లు తాగించాడు. మత్తులోకి వెళ్లిన బాలుడిని అతని టీ-షర్టు తోనే గొంతు బిగించి చంపాడు. కాల్ యాప్ ద్వారా బాలుడి తల్లిదండ్రులకు ఇంటర్​నెట్ కాల్​చేసి రూ.45 లక్షలు డిమాండ్​చేశాడు.

డబ్బులు ఇవ్వకపోయినా, పోలీసులకు చెప్పినా బాబును చంపేస్తానని బెదిరించాడు. రెండుసార్లు డబ్బులు తీసుకోవడం వీలుపడలేదు. దీంతో హత్యాస్థలానికి వెళ్లి డెడ్​బాడీని పెట్రోల్ పోసి తగలబెట్టాడు. టెక్నికల్​ఎవిడెన్స్ ఆధారంగా పోలీసులు నిందితుడు మంద సాగర్ ను అదుపులోకి తీసుకొని విచారించారు. నేరం చేశాడని నిర్ధారించుకొని అక్టోబర్ 22న అరెస్ట్ చేశారు. నిందితుడికి మరణశిక్ష పడడంతో బాలుడి తల్లిదండ్రులు కోర్టు సెంటర్ వద్ద న్యాయదేవత, పోలీస్ సింబల్ ఉన్న బ్యానర్లకు క్షీరాభిషేకం చేశారు. వారి బంధువులు పటాకులు కాల్చారు.

ఈ కేసులో దోషికి శిక్ష పడేలా కృషి చేసిన సీఐలు రవి కుమార్, సతీశ్, ఎస్​ఐలు అరుణ్ కుమార్, వెంకటా చారిని జిల్లా ఎస్పీ చంద్రమోహన్ అభినందించారు. జిల్లా పోలీస్ టీమ్ కృషిని డీజీపీ అంజన్ కుమార్ యాదవ్​ ట్విట్టర్ వేదికగా
అభినందించారు.