సింగరేణి లాభాల వాటాను ఇంకెప్పుడు పంచుతరు?

సింగరేణి లాభాల వాటాను ఇంకెప్పుడు పంచుతరు?
  • ఐదు నెలలుగా ఆశగా ఎదురు చూస్తున్న కార్మికులు
  • మూడు నెలల కింద రూ.700 కోట్లు కార్మికులకు పంచుతామని సీఎం కేసీఆర్​ప్రకటన
  • జులై నెలలో రూ.2, 222కోట్ల లాభాలు వచ్చినట్లు సీఎండీ వెల్లడి  
  • కానీ నేటికీ కార్మికుల వాటా శాతం ఎంతో తేల్చని అధికారులు

కోల్​బెల్ట్, వెలుగు,  సింగరేణి లాభాల్లో కార్మికుల వాటాను పంచడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కంపెనీ చరిత్రలోనే మొదటిసారి 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.2వేల కోట్లకు పైగా లాభాలు సాధించామని సీఎండీ వెల్లడించి రెండు నెలలు దాటి పోతున్నా నేటికీ కార్మికులకు ఇచ్చే వాటా శాతాన్ని ప్రకటించలేదు. అంతకు మూడు నెలల ముందు మంచిర్యాల సభలో సింగరేణి లాభాల్లోని రూ.700 కోట్లను కార్మికులకు పంచుతామని సీఎం కేసీఆర్​ ప్రకటించి వదిలేశారు. సీఎం కేసీఆర్, కంపెనీ సీఎండీ శ్రీధర్ వేర్వేరుగా కార్మికులకు అత్యధిక బోనస్ ఇస్తామని ప్రకటించడంతో ఎంత వస్తుందోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసి ఐదు నెలలు దాటిపోతున్నా వాటా శాతాన్ని ప్రకటించకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2021–22 సంవత్సరంలోని లాభాల్లో 30 శాతం వాటాను కార్మికులకు బోనస్​గా చెల్లించారు. ఈసారి ఎంత ఇస్తారనే దానిపై అధికారులు నేటికీ క్లారిటీ ఇవ్వలేదు. టీబీజీకేఎస్, సింగరేణి యాజమాన్యం చొరవ తీసుకోవడం లేదని కార్మికులు, కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. 

లాభాలు డబుల్

సింగరేణి సంస్థ గడిచిన ఆర్థిక సంవత్సరంలో భారీ మొత్తంలో లాభాలు సాధించింది. అంతకు ముందు సంవత్సరం రూ.1,227 కోట్లు రాగా, 2022-–23లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించిన ట్యాక్స్​లు, ఖర్చులు పోగా ఏకంగా రూ.2,222 కోట్ల నికర లాభాలు సాధించింది. కోల్, పవర్​అమ్మకాల ద్వారా రూ.3,074 కోట్ల ఆదాయం ఆర్జించింది. గతేడాది 67.10 మిలియన్​ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించగా 66.70 మిలియన్​టన్నుల బొగ్గును ట్రాన్స్​పోర్ట్​చేసింది. మొత్తంగా రూ.33,065 కోట్ల బిజినెస్​చేసింది. మార్చితో ఆర్థిక సంవత్సరం ముగిసినా, ఆడిట్​ పూర్తి చేయడానికి సింగరేణి ఎక్కువ టైమ్​తీసుకుంది. ఆర్థిక సంవత్సరం ముగిసిన వెంటనే లాభాలు ప్రకటించాలని కార్మిక సంఘాలు డిమాండ్​ చేస్తున్నప్పటికీ ఈ యేడాది మూడు నెలల తర్వాత జులై 7న లాభాలు ప్రకటించింది.

స్పష్టత ఇయ్యలే..

సింగరేణిలో 1999 నుంచి కార్మికులకు సంస్థ సాధించిన లాభాలపై కొంత వాటా చెల్లిస్తున్నారు. మొదటి దఫా10 శాతం వాటా చెల్లించిన సంస్థ, తర్వాత ఏటా కొంత పెంచుకుంటూ వస్తోంది. కిందటేడు 30 శాతం లాభాల వాటాను పంపిణీ చేసింది. ఈ సారి ఎంత ఇస్తారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. సీఎం, సీఎండీ మాత్రం ఎక్కువ బోనస్​ఉంటుందని ప్రకటించారు. మొదట్లో గుర్తింపు సంఘం లీడర్లు కార్మికులకు చెల్లించే లాభాల వాటాపై సీఎం దృష్టికి తీసుకెళ్లేవాళ్లు. అయితే తెలంగాణ సర్కార్​ఏర్పడ్డాక గుర్తింపు సంఘం లీడర్ల ప్రయారిటీ తగ్గి కోల్​బెల్ట్​ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులే ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తున్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసి ఐదు నెలలు దాటుతున్నా కార్మికుల లాభాల వాటా, చెల్లింపు కోసం ఇప్పటి వరకు కోల్​బెల్ట్​ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సీఎంను కలువలేదు. సింగరేణి ఫండ్స్​నియోజకవర్గాల అభివృద్ధికి కేటాయించాలని ఒత్తిడి తీసుకొచ్చిన ఎమ్మెల్యేలు కార్మికులకు రావాల్సిన బోనస్​విషయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు.  దసరాకు ముందే చెల్లిస్తే ప్రయోజనం ఉంటుందని పలువురు భావిస్తున్నారు.

‘2014కు ముందు సింగరేణి లాభాలు రూ.300 నుంచి 400 కోట్ల పరిమితమయ్యాయి. కార్మికులకు బోనస్ కూడా తక్కువగా వచ్చేది. కార్మికుల కష్టార్జితంతో ఈ ఏడాది రూ.2,164 కోట్ల లాభాలు వచ్చాయి. లాభాల బోనస్​గా కార్మికులకు రూ.700 కోట్లు పంచుతాం’
- జూన్​9న మంచిర్యాల బహిరంగ సభలో సీఎం కేసీఆర్

‘సింగరేణి చరిత్రలో మొదటిసారి 2022-–-23 ఆర్థిక సంవత్సరంలో రూ.33,065 కోట్ల టర్నోవర్​తో రూ.2,222 కోట్ల నికర లాభాలు సాధించింది. త్వరలోనే లాభాల్లో కార్మికుల వాటాను తేల్చి, అత్యధిక బోనస్​ అందిస్తాం’
- జులై 7న సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్​ప్రకటన

ఎన్నికల లబ్ధి కోసమే జాప్యం

సింగరేణి, అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల లాభాల వాటా చెల్లింపు ప్రకటనలో జాప్యం చేస్తోంది. 3 నెలల కింద స్వయాన సీఎం లాభాలు ప్రకటించినా, వాటా విషయమై ఇప్పటి వరకు కోల్​బెల్ట్​ ప్రజాప్రతినిధులు సీఎంతో మాట్లాడలేదు 
– మందా నర్సింహారావు, సీఐటీయూ నేత

ఎన్నికల ముందు ఇచ్చే ప్లాన్?

గుర్తింపు సంఘం ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ప్లాన్​తోనే  కార్మికుల లాభాల వాటా ఎంత, పంపిణీ ఎప్పుడన్న విషయంలో సర్కార్ జాప్యం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్టోబర్​లో ఎన్నికలు వస్తాయని భావించి వ్యూహత్మకంగా దసరా పండుగ లోపు చెల్లిస్తామని మంచిర్యాల సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారని చర్చించుకుంటున్నారు. అక్టోబర్ 28న ఎన్నికలు నిర్వహించే చాన్స్ ఉండగా దసరా పండుగకు ముందు వాటా చెల్లిస్తారని సంఘాలు భావిస్తున్నాయి. సీఎం ప్రకటించిన విధంగా రూ.700 కోట్లను లాభాలుగా పంపిణీ చేస్తే ఒక్కో కార్మికుడికి రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు వచ్చే చాన్స్ ఉంది.