- ఒక్కో క్యాండిడేట్‌కు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షలు ఖర్చయ్యే చాన్స్
- కొన్ని డివిజన్లలో రూ.కోటికి పైనే...
- ఖర్చు చేసే స్థోమత ఉన్నోళ్లకే టికెట్లు అంటున్న పార్టీలు
- టికెట్ కావాలంటే రూ.10 లక్షలు డిపాజిట్ చేయాలంటున్న ఓ నేషనల్ పార్టీ
మంచిర్యాల, వెలుగు : ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్న పని. క్యాండిడేట్లు.. నామినేషన్ వేసింది మొదలుకొని పోలింగ్ వరకు.. ప్రచారం, అనుచరుల మందువిందుల ఖర్చులు భరించడంతో పాటు ఓటర్లకు తాయిలాలు ఇవ్వడం పరిపాటిగా మారింది. ఇందుకు అనుగుణంగానే ఇటు అభ్యర్థులు, అటు ఓటర్లు సైతం సిద్ధమవుతున్నారు. మంచిర్యాల కార్పొరేషన్‌ను దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా తలపడుతున్నాయి.
ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో ఉన్న క్యాండిడేట్లు భారీ మొత్తంలో ఖర్చు చేసేందుకు సైతం వెనుకాడడం లేదు. నామినేషన్లు వేసిన క్యాండిడేట్లు ఇప్పటికే అన్నీ సిద్ధం చేసుకున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఒక్కో అభ్యర్థికి రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల ఖర్చు..
మంచిర్యాల కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షలు ఖర్చు పెట్టేందుకు రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్న క్యాండిడేట్లు ఎంత ఖర్చుకైనా వెనుకాడడం లేదు. ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేసేలా.. హంగూ ఆర్భాటాలతో ప్రచారం నిర్వహించేందుకు లక్షలు ఖర్చు చేస్తున్నారు. అలాగే ఒక డివిజన్‌లో 2,500 నుంచి 3,500 మంది వరకు ఓటర్లు ఉన్నారు.
ఒక్కో ఓటుకు రూ. 1000 నుంచి రూ. 2 వేలు పంపిణీ చేస్తేనే గెలుస్తామన్న భావనలో ఉన్నారు. ఈ లెక్కన ఒక్కో డివిజన్‌లో రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని డివిజన్లలో అయితే రూ. కోటికి పైగా ఖర్చయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయినా క్యాండిడేట్లు మాత్రం ఖర్చు పెట్టేందుకే సై అంటున్నారు.
పైసలు ఉంటేనే టికెట్
కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు టికెట్లు ఇచ్చేందుకు అభ్యర్థుల ఆర్థిక స్థితిగతులను సైతం పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఎన్నికల్లో కనీసం రూ.50 లక్షల వరకు ఖర్చు చేసే కెపాసిటీ ఉన్న వారికే టికెట్లు కేటాయిస్తామని మూడు పార్టీలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఒక్కో డివిజన్ నుంచి నలుగురైదుగురు నాయకులు టికెట్లు ఆశిస్తుండడంతో ‘నీ దగ్గర రూ. 50 లక్షలు ఉన్నాయా’ అని అడిగి మరీ టికెట్లు కేటాయించే పరిస్థితి నెలకొంది. ఓ జాతీయ పార్టీ అయితే.. టికెట్ కేటాయించాలంటే మినిమం రూ.10 లక్షలు డిపాజిట్ చేయాలని డిమాండ్ చేస్తోందని సమాచారం. క్యాండిడేట్లు డిపాజిట్ చేసిన డబ్బులను ఎన్నికల్లోనే ఖర్చు పెడతామని నాయకులు చెబుతున్నారని తెలిసింది.
భూములమ్మి, అప్పులు చేసి..
కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్న నాయకులు ఖర్చుల కోసం భూములు అమ్మడంతో పాటు లక్షల్లో అప్పులు చేస్తున్నారని సమాచారం. ఓ జాతీయ పార్టీకి చెందిన ఓ క్యాండిడేట్ తన సొంత గ్రామంలో ఉన్న రెండు ఎకరాల భూమిని అమ్మి ఎన్నికల ఖర్చుల కోసం డబ్బులు సమకూర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో ప్రాంతీయ పార్టీకి చెందిన అభ్యర్థి.. సన్నిహితులు, తెలిసిన వారి వద్ద ఇప్పటికే రూ.20 లక్షలు అప్పు తీసుకున్నట్లు సమాచారం.
ఈ సారి పలు డివిజన్లలో రియల్టర్లు, వ్యాపారవేత్తలు తమ దందాలను కాపాడుకునేందుకు ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఆయా డివిజన్లలో ఖర్చు రూ.50 లక్షలు దాటే అవకాశం ఉంది. మొత్తంగా మంచిర్యాల కార్పొరేషన్ ఎన్నికల ఖర్చు రూ.100 కోట్లకు చేరుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
