
తిమ్మాపూర్, వెలుగు: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూర్ శివారులోని మామిడికుంట చెరువు కబ్జాకోరల్లో చిక్కుకుంది. ఇప్పటికే మత్తడి పూర్తిగా కనుమరుగవ్వగా.. ప్రస్తుతం చెరువులోకి వరదొచ్చే కాలువను సైతం రియల్టర్లు వెంచర్ చేసి, అమ్మిన ఘటన వెలుగుచూసింది. గ్రామంలోని మామిడికుంటచెరువుకు పలువురి పట్టా భూముల మీదుగా వరదకాలువ ఉంది. సర్వే నెంబర్ 252, 253లోని భూమి.. చెరువు ఎఫ్‌టీఎల్‌లో పూర్తిగా మునిగి ఉంటుంది. కాగా సర్వే నెంబర్ 252లోని దాదాపు 1.20 ఎకరాలతోపాటు సర్వే నంబర్ 253లో 14 గుంటలను ఓ రియల్టర్ వెంచర్‌గా మార్చాడు. ఈ క్రమంలో వరద కాలువను మట్టితో పూర్తిగా నింపి, వరద నీరు వెళ్లేందుకు నామమాత్రంగా చిన్న కాలువను నిర్మించాడు. వెంచర్‌లోకి నీరు వెళ్లకుండా అడ్డంగా పెద్ద గోడనే కట్టేశాడు.
మామూళ్ల మత్తులో అధికారులు
మామిడి కుంట చెరువు సుమారు 25 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీనిచుట్టూ పట్టా భూములు ఉన్నాయి. వీటి చుట్టూ రియల్ఎస్టేట్ జోరందుకోవడంతో కబ్జారాయుళ్ల కన్ను చెరువు శిఖం, పక్కనున్న పట్టా భూములపై పడుతోంది. తక్కువ ధరకు భూములు కొనడం.. వెంచర్‌గా మార్చి రూ.కోట్లు దండుకోవడం ఇక్కడ సర్వసాధారణమైంది. మాముళ్లకు ఆశపడిన అధికారులు రియల్టర్లకు అనుకూలంగా చెరువు భూములను సైతం రిజిస్ట్రేషన్లు లక్షల్లో ముడుపులు దండుకున్నట్లు తెలుస్తోంది. చెరువుగానీ, వరద కాలువ విషయాలేవి ప్రజలకు చెప్పని రియల్టర్వరద కాలువలో ప్లాట్లు అమ్మి రూ.కోట్లలో సొమ్ముచేసుకున్నట్లు సమాచారం. చెరువే జీవనాధారంగా ఆధారపడిన ముదిరాజ్కులస్తులు ప్రశ్నార్థకంగా మారింది.