మావోయిస్టు నాయకుడు మధు కరోనాతో మృతి

మావోయిస్టు నాయకుడు మధు కరోనాతో మృతి
  • ఈనెల 2న వరంగల్ శివార్లలో  పోలీసులకు పట్టుపడిన మధు
  • అనారోగ్యంతో ఇబ్బందిపడుతుండడంతో వరంగల్ ఎంజీఎంకు తరలింపు
  • పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు తరలిస్తుండగా మృతి

 హైదరాబాద్: మావోయిస్టు నాయకుడు మధుకర్ హైదరాబాద్ నగరంలో కరోనాకు చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మరణించాడు. ఆయనపై 8 లక్షల రివార్డు ఉన్నది. నాలుగు రోజుల క్రితం అంటే ఈనెల 2 న వరంగల్ శివార్లలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా మావోయిస్టు దండకారణ్య సబ్ కమిటీ నేత మధుకర్ పట్టుపడ్డాడు. అనారోగ్యంతో ఉండడంతో వెంటనే వరంగల్ MGM  ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అయితే నిన్న రాత్రి పరిస్థితి విషమించడం వల్ల హైదరాబాద్ కు తరలించినట్టు పోలీసులు చెబుతున్నారు. తెల్లవారుజామున శ్వాసకోశ వ్యాధులకు తోడు తీవ్ర గుండెపోటు రావడంతో  చనిపోయినట్లు పోలీసు వర్గాల కథనం. 
కుమురం భీం జిల్లా బెజ్జూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మధుకర్ సుమారు 22 ఏళ్ల క్రితం పీపుల్స్ వార్ దళంలో చేరాడు. ముందుగా కొరియర్ గా.. దళ సభ్యుడిగా పనిచేసి అంచెలంచెలుగా ఎదిగాడు. పోలీసులకు చిక్కిన సమయంలో దండకారణ్యం స్పెషల్ జోన్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇతని మృతదేహాన్ని పోలీసులు సొంతూరు బెజ్జూరు మండలం కొత్తపల్లికి తరలించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నట్లు సమాచారం. 
దండకారణ్యంలో మరో 12 మంది మావోయిస్టులకు కరోనా
మావోయిస్టులకు కరోనా ఎఫెక్ట్ తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు సమాచారం. నాలుగు రోజుల క్రితం పోలీసులకు పట్టుపడిన మధుకర్ ఇచ్చిన సమాచారం మేరకు 12 మంది దళనాయకులు తనలాగే అస్వస్థతకు గురయ్యారని.. చెప్పినట్లు తెలుస్తోంది. తాను కూడా అనారోగ్యంతో అడవుల్లో ఉండలేక చికిత్స కోసం పట్టణానికి వస్తూ దొరికిపోయానని మధుకర్ వెల్లడించాడు.