V6 News

పెట్రోల్ బంకుల్లో మౌలిక వసతులు కల్పించాలి : నిత్యానందం

పెట్రోల్ బంకుల్లో మౌలిక వసతులు కల్పించాలి :  నిత్యానందం

మెదక్​ టౌన్, వెలుగు: పెట్రోల్​బంకుల్లో వినియోగదారులకు మౌలిక వసతులు కల్పించాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నిత్యానందం అన్నారు. మెదక్ పట్టణంలోని శ్రీనివాస పెట్రోల్ బంక్​ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంధన కొలతల్లో తేడాలు, ఫిల్టర్ పేపర్ టెస్ట్‌‌లో అనుమానాస్పద ఫలితాలు, తాగునీరు, టాయిలెట్స్, ఫస్ట్ ఎయిడ్, ఉచిత గాలి వంటి సదుపాయాలు లేకపోవడాన్ని గుర్తించారు. వినియోగదారులను మోసం చేస్తారా అంటూ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇంధనాన్ని ఖచ్చితమైన కొలతలు, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా విక్రయించాలని ఆదేశించారు. పెట్రోల్ బంక్​పై ప్రాథమికంగా కేసు నమోదు చేసి, సంబంధిత చట్టాల కింద వివరణ కోరినట్లు తెలిపారు. సరైన విధంగా స్పందించకపోతే బంకును సీజ్​చేయడం సహా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇంధన నాణ్యత, కొలతలపై అనుమానాలుంటే పౌరసరఫరాలు, లీగల్ మెట్రాలజీ శాఖలకు ఫిర్యాదు చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.