మెదక్, వెలుగు: కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే కన్న కొడుకును దారుణంగా చంపేశాడు. మెదక్ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ మండలం పెద్దబాయి తండాకు చెందిన బదావత్ భాస్కర్‌కు అదే మండలం తిమ్మక్కపల్లి తండాకు చెందిన లావణ్యతో ఆరేళ్ల కింద పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. కాగా, కొంత కాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వారం రోజుల కింద లావణ్య భర్తతో గొడవ పడి పిల్లలను వదిలేసి తల్లిగారింటికి వెళ్లిపోయింది.
శనివారం రాత్రి తాగిన మైకంలో భాస్కర్ చిన్న కొడుకు బదావత్ లక్కీ(రెండున్నరేళ్లు) గొంతుకు స్వెటర్ నాడా బిగించి చంపేశాడు. ఆదివారం విషయం వెలుగులోకి రాగా, రూరల్ పోలీసులు బాలుడి డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భాస్కర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
