మెదక్ టౌన్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. అభివృద్ధి, సంక్షేమానికే పట్టం కట్టాలని ఓటర్లను కోరారు. బుధవారం మెదక్ మండలంలోని మాచవరం, ర్యాలమడుగు, పేరూరు, రాజ్పల్లి, మక్తభూపతిపూర్, పాతూరు గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న పార్టీకి ఓటేసి గెలిపిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్లు బలపరిచిన అభ్యర్థులకు వేసి ఓటును వృథా చేసుకోవద్దని చెప్పారు. రాష్ట్రంలో మరో మూడేండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, ఎమ్మెల్యేగా తానే ఉంటానని గ్రామాలను సమష్టిగా అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు. కాంగ్రెస్అధికారంలోకి వచ్చాక 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని, 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతులకు పంట పెట్టుబడి సాయంగా అందించామని గుర్తు చేశారు. సన్న వడ్లకు రూ.500 బోనస్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహావసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శంకర్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ చౌదరి, నాగరాజు, ఆంజనేయులు, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

