కల్యాణలక్ష్మి కోసం సర్టిఫికెట్లు ఫోర్జరీ.. మీసేవ ఆపరేటర్‌తో పాటు మరొకరి అరెస్ట్‌

కల్యాణలక్ష్మి కోసం సర్టిఫికెట్లు ఫోర్జరీ.. మీసేవ ఆపరేటర్‌తో పాటు  మరొకరి అరెస్ట్‌

గుడిహత్నూర్, వెలుగు: కల్యాణలక్ష్మి డబ్బుల కోసం సర్టిఫికెట్లు ఫోర్జరీ చేసిన మీసేవ ఆపరేటర్‌తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆదిలాబాద్​ జిల్లా గుడిహత్నూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్పీ కాజల్‌ వివరాలు వెల్లడించారు. గుడిహత్నూర్‌ మండలంలోని మన్నూర్‌ గ్రామానికి చెందిన ఇంగ్లే అంకుశ్, కదం శ్యాంసుందర్‌ తమ కూతుళ్లకు 18 ఏళ్లు నిండకముందే పెళ్లిళ్లు చేశారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన జాదవ్‌ గణేశ్  కొంత డబ్బులు ఇస్తే కల్యాణలక్ష్మి వచ్చేలా చూస్తానని వారితో ఒప్పందం చేసుకున్నాడు.

గణేశ్​వారి వద్ద రూ.20 వేలు తీసుకుని మండల కేంద్రంలోని మీసేవ ఆపరేటర్‌ ములజ్కర్‌ శరత్‌ సాయంతో అంజలి, మౌనిక ఆధార్‌ కార్డులు, బోనఫైడ్‌ సర్టిఫికెట్లలో వయసు మార్చి నకిలీ పత్రాలు సృష్టించి కల్యాణలక్ష్మి కోసం అప్లై చేశాడు. ఈ విషయం ఎస్సై శ్రీకాంత్‌కు తెలియడంతో విచారణ చేపట్టారు. నిందితులు ఫోర్జరీకి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో మీసేవ ఆపరేటర్‌శరత్, మధ్యవర్తి గణేశ్ ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మైనర్లకు పెళ్లి చేసినందుకు అంకుశ్, శ్యాంసుందర్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ పరారీలో ఉన్నారు. ఇచ్చోడ సీఐ రమేశ్, ఎస్సై శ్రీకాంత్‌ పాల్గొన్నారు.