
ఆదిలాబాద్‌టౌన్, వెలుగు : కొత్తగా పార్టీలో చేరే పారాషూట్ లీడర్లకు ఆదిలాబాద్ టికెట్టు రాదని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సి.రాంచంద్రా రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్ నియోజకవర్గం పార్టీ టికెట్ కోసం ముగ్గురు పోటీ పడుతున్నారన్నారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన కంది శ్రీనివాస రెడ్డికి పార్టీ టిక్కెట్ రాదని స్పష్టం చేశారు. పారాషూట్ లీడర్లకు టిక్కెట్ ఇవ్వొద్దని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు.
పార్టీ జెండా మోసిన వారికే ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. శుక్రవారం నుంచి పార్టీ నేతలందరు కలిసి గడప గడపకు కార్యక్రమాన్ని జైనథ్ మండలం బెల్లూరి గ్రామంలో నిర్వహిస్తామన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవ్ రెడ్డి, దిగంబర్‌రావు పాటిల్, శ్రీకాంత్ రెడ్డి, శ్రీధర్, అంబకంటి అశోక్, చరణ్‌గౌడ్, శంతన్‌రావు, రాహుల్, గౌస్, సమీర్, ఆనంద్‌రావు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.