పాక్​లో టెర్రర్​ దాడులు.. ఐదుగురు పోలీసులు.. నలుగురు మిలిటెంట్లు మృతి

పాక్​లో టెర్రర్​ దాడులు.. ఐదుగురు పోలీసులు.. నలుగురు మిలిటెంట్లు మృతి

పెషావర్: పాకిస్తాన్​లో టెర్రరిస్టులు మళ్లీ దాడులకు పాల్పడ్డారు. రీజినల్ పోలీస్ హెడ్ క్వార్టర్, చెక్ పోస్టుపై అటాక్ చేశారు. ఈ దాడుల్లో ఐదుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కాల్పుల్లో నలుగురు మిలిటెంట్లు కూడా హతమయ్యారు. ఇటీవల ఖైబర్ పక్తుంఖ్వా ప్రావిన్స్​లోని ఆర్మీ పోస్టుపై దాడి చేసి 23 మంది సైనికులను చంపేసిన టెర్రరిస్టులు.. ఇప్పుడు మళ్లీ అదే ప్రావిన్స్​లో శుక్రవారం దాడులకు పాల్పడ్డారు. మొదట టంక్ జిల్లాలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్​పై అటాక్ చేశారు.

ఒక టెర్రరిస్టు ఆఫీస్ ఎంట్రెన్స్ వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడగా, మిగతా టెర్రరిస్టులు లోపలికి ప్రవేశించి కాల్పులు జరిపారు. ఈ దాడిలో ముగ్గురు పోలీసులు, ఎదురుకాల్పుల్లో నలుగురు మిలిటెంట్లు హతమయ్యారని అధికారులు తెలిపారు. ఖైబర్ జిల్లాలో పోలీస్ చెక్ పోస్టుపైనా టెర్రరిస్టులు దాడి చేశారని చెప్పారు. ఇక్కడ ఇద్దరు పోలీసులు చనిపోయారని, మరో ఆరుగురు గాయపడ్డారని పేర్కొన్నారు.