లారీలు లేక కదలని ధాన్యం.. రవాణాకు సిద్ధంగా 50 వేల బస్తాలు

లారీలు లేక కదలని ధాన్యం.. రవాణాకు సిద్ధంగా 50 వేల బస్తాలు
  • వెయిట్ లాస్ పేరిట కోతలు పెడుతున్న మిల్లర్లు 
  •  లారీ డ్రైవర్ల అక్రమ వసూళ్లు  
  • లింగంపేట పరిధిలో పలు సొసైటీల కేంద్రాల్లో దుస్థితి

లింగంపేట, వెలుగు: ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాతలు అరిగోస పడుతున్నారు. వర్షాల వల్ల దిగుబడి తక్కువ వచ్చినా ఉన్న ధాన్యాన్ని మిల్లులకు పంపించేందుకు అవస్థలు పడుతున్నారు. వారం రోజులుగా లారీలు రాకపోవడంతో, 50 వేల బస్తాలు కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయాయి. ఈ వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌లో లింగంపేట మండలంలో 30 వేల ఎకరాల్లో  వరి సాగైంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చి నిల్వ చేశారు. 

మండలంలో నల్లమడుగు, లింగంపేట, శెట్టపల్లి సంగారెడ్డి గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. లింగంపేట సొసైటీ పరిధిలో లింగంపేట, లింగంపల్లి, సురాయిపల్లి, కోమట్‌‌‌‌‌‌‌‌పల్లి, పొతాయిపల్లి, శెట్టపల్లి, జల్దిపల్లి, భవానీపేట, ముంబాజీపేట, నల్లమడుగు సొసైటీ పరిధిలో మోతె, నల్లమడుగు, బానాపూర్, బాయంపల్లి, శెట్టపల్లి, సంగారెడ్డి సొసైటీ పరిధిలో పోల్కంపేట, మాలపాటి, శెట్టపల్లి సంగారెడ్డి గ్రామాల్లో సొసైటీల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

అదనంగా మరో 21 కేంద్రాలను ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా, మిల్లర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం బస్తాలతో వెళ్లిన లారీ అన్‌‌‌‌‌‌‌‌లోడ్ కావడానికి రెండు రోజులు పడుతోంది. తిరిగి కేంద్రానికి రావడానికి మరో రోజు పడుతోంది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయని రైతులు వాపోతున్నారు.  

వెయిట్‌‌‌‌‌‌‌‌లాస్ పేరిట మిల్లర్ల దోపిడీ.. 

వరి ధాన్యాన్ని ఆరబెట్టి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు.  నిర్వాహకులు 15 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని తూకం వేస్తున్నారు. తూకం వేసిన రెండు-, మూడు రోజుల తర్వాత ధాన్యాన్ని లారీలలో నింపి రైస్ మిల్లులకు తరలిస్తారు. కొందరు రైస్ మిల్లుల యజమానులు ధాన్యం వెయిట్‌‌‌‌‌‌‌‌లో తక్కువగా ఉందని చెప్పుకుని, ఒక్కో లారీలో మూడు, -నాలుగు క్వింటాళ్ల ధాన్యాన్ని దోపిడి చేస్తున్నారని మేంగారం, శెట్టపల్లి, అయ్యపల్లి గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు సకాలంలో కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపాలని కోరుతున్నారు.   

లారీ డ్రైవర్ల అక్రమ వసూళ్లు 

కాంటా చేసిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లులకు తరలించాలంటే, లారీ డ్రైవర్లు బస్తాకు రూపాయి చొప్పున వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇస్తామంటేనే లారీని కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తున్నారు. లేకపోతే, లారీని మరో కేంద్రానికి పంపిస్తారని కేంద్ర నిర్వాహకులు తెలిపారు. హమాలీ, దడువాయి, టాపర్ల ఖర్చులను రైతులే భరిస్తారు. అక్రమ వసూళ్లను అరికట్టాలని రైతులు కలెక్టర్​ను కోరుతున్నారు.

డ్రైవర్‌‌‌‌‌‌‌‌కు బస్తాకు రూపాయి ఇచ్చా.. 

శెట్టపల్లి కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించాను. ధాన్యం బస్తాలను లారీలో తరలించేందుకు డ్రైవర్ బస్తాకు రూపాయి  ఇచ్చాను. ఒక్కో లారీకి రూ.900 చొప్పున చెల్లించాల్సి వచ్చింది.  లారీ డ్రైవర్ల అక్రమ వసూళ్లను ఆఫీసర్లు నిరోధించాల్సిన అవసరం ఉంది.- కిష్టాగౌడ్ రైతు, శెట్టపల్లి

22 వేల బస్తాలు నిల్వ.. 

లారీలు సకాలంలో రాక కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం బస్తాలు నిల్వ ఉన్నాయి. లింగంపేట సొసైటీ పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో 22 వేల బస్తాల ధాన్యం నిల్వ ఉన్నాయి. లారీల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కువ లారీలు సివిల్ సప్లై బియ్యం తరలించడానికి వెళ్లినందున, ధాన్యం బస్తాలను తీసుకోవడంలో ఆలస్యం జరుగుతోంది. పెంటయ్య, సొసైటీ సీఈవో, లింగంపేట