
- మహిళా అభ్యర్థిని పోటీకి దింపే అవకాశం
- కాంగ్రెస్‌తో స్నేహపూర్వక పోటీ?
- నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిట్టింగ్ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్నియోజకవర్గాన్ని చేజిక్కించుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు వ్యుహరచన చేస్తున్నాయి. ఇందులో భాగంగా మజ్లిస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. కాంగ్రెస్‌తో స్నేహ పూర్వక పోటీ చేస్తూనే ఉప ఎన్నికల్లో ఈ సీటు కైవసం చేసుకునేందుకు ఎత్తుగడలు వేస్తోంది. ఈసారి మహిళా అభ్యర్థిని రంగంలోకి దింపాలని చూస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో మహిళా సాధికారత కోసం గళం విప్పుతున్న విద్యావంతురాలు, జాతీయ కరాటే చాంపియన్ సయ్యదా ఫలక్ అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిసింది. మహిళను నిలబెడితే వారి ఓట్లతో పాటు మైనారిటీ ఓట్లను కూడా సాధించవచ్చని ప్లాన్చేస్తోంది. ఆమెతోపాటు మరో ఇద్దరు కార్పొరేటర్ల పేర్లు కూడా పరిశీలిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెప్పాయి. కాంగ్రెస్ పార్టీతో దోస్తీ కొనసాగుతున్నా అది బీఆర్ఎస్సిట్టింగ్ స్థానం కావడంతో గెలిచి మరో సీటు పెంచుకోవాలని ఆరాటపడుతోంది.
2014లో గెలుపు అంచుల వరకు..
2014 ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్ అప్పటి టీడీపీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ పై 9వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. గెలుపు అంచుల వరకు వెళ్లడంతో జూబ్లీహిల్స్‌ను ఎప్పటికైనా దక్కించుకోవాలన్న ప్లాన్‌లో మజ్లిస్ఉంది. నియోజకవర్గంలో మజ్లిస్గెలుపును ప్రభావితం చేసే స్థాయిలో సుమారు 80వేల వరకూ మైనారిటీల ఓట్లు ఉండడంతో పోటీచేస్తే గెలుపు ఖాయమన్న ధీమాతో ఆ పార్టీ ఉంది. గత బల్దియా ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్‌లోని షేక్‌పేట, ఎర్రగడ్డ డివిజన్లను మజ్లిస్‌పార్టీ దక్కించుకుంది.
బోరబండ, రహ్మత్‌నగర్, యూసుఫ్‌గూడ తదితర డివిజన్లలో రెండో స్థానంలో నిలిచింది. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్తో ఉన్న దోస్తీ కారణంగా మజ్లిస్ పోటీ చేయలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మిత్రపక్షంగా స్నేహపూర్వక పోటీ చేసింది. కానీ, ఈసారి మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లో పాగావేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
పాతబస్తీలో తిరుగులేని శక్తి..
మజ్లిస్ ఇప్పటికే పాతబస్తీలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఇక్కడి ఏడు నియోజకవర్గాలు మజ్లిస్‌కు కంచుకోటగా మారాయి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వారితో స్నేహ పూర్వకంగా ఉంటూ వస్తోంది. ప్రస్తుతం అధికార కాంగ్రెస్‌పార్టీతో దోస్తీ చేస్తున్నా జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కాబట్టి దక్కించుకోవాలని భావిస్తోంది.
కాంగ్రెస్ వ్యూహాలు
కాంగ్రెస్ పార్టీ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది. దీని కోసం ఇప్పటి నుంచే పకడ్బందీ వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణ ఆవిర్భావానికంటే ముందు నుంచి కాంగ్రెస్‌కు మజ్లిస్ తో మంచి దోస్తానా ఉంది. 1957 నుంచి మొదలుకుంటే ఇప్పటివరకు జూబ్లీహిల్స్నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల్లో ఎక్కువ సార్లు గెలిచిన పార్టీ కూడా కాంగ్రెస్సే.. ఇక్కడ ఆ పార్టీకి మంచి ఓటు బ్యాంక్ ఉంది.
ఈ క్రమంలో ఈసారి నిర్వహించబోయే ఉప ఎన్నికల్లో ఈ స్థానాన్ని గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉండడం, కంటోన్మెంట్ఎన్నికల్లో గెలవడం కూడా లాభిస్తుందని, తమకు జూబ్లీహిల్స్‌ను వదిలేయాలని మజ్లిస్‌పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీంతో స్నేహం కోసం మజ్లిస్ పోటీ చేయకుండా ఉంటుందా? లేక నగరంలో తమ పార్టీ కూడా మరో సీటును సాధించాలన్న పట్టుదలతో పోటీలో ఉంటుందా? అన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
ఎవరీ సయ్యద్ ఫలక్?
సయ్యదా ఫలక్ కరాటే ఛాంపియన్ మాత్రమే కాకుండా విద్యావంతురాలు కూడా. ఈమె చాలా కాలంగా మహిళల సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఉమ్మడి పౌరసత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్, ఢిల్లీ, దేవబంద్, షాహీన్‌బాగ్‌లలో జరిగిన నిరసన కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. కొంత కాలంగా నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు పైదల్దౌరా (పాదయాత్రలు) చేస్తున్నారు.