గిరిజన తండాల అభివృద్ధికి ప్రత్యేక కృషి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

గిరిజన తండాల అభివృద్ధికి ప్రత్యేక కృషి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ధర్మారం, వెలుగు: గిరిజన తండాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. బుధవారం ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామం నుంచి పెగడపెల్లి మ్యకవెంకయ్యపల్లె వరకు రూ.11.2 కోట్లతో నిర్మించనున్న బైపాస్ రోడ్డును  మంత్రి పరిశీంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక సీఎం రేవంత్ రెడ్డి  ఆలోచన మేరకు గిరిజన తండాల్లో రోడ్ల నిర్మాణానికి రూ.740 కోట్లు మంజూరు చేయించినట్లు చెప్పారు. 

గిరిజన, లంబాడీ తండాల్లో గిరిజన భవన్ నిర్మాణాలకు నిధులు మంజూరుచేయిస్తానన్నారు. గతంలో ట్రైబల్ వెల్ఫేర్ నుంచి మంజూరైన రూ.12 కోట్లతో కీచులాటపల్లె, బుద్దేశ్ పల్లె, దుబ్బాలగూడెం రోడ్ల పనులు చేపట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో ధర్మారం మార్కెట్ చైర్మన్ లావుడ్య రూప్లా నాయక్,కాంగ్రెస్ లీడర్లు చింతల ప్రదీప్ రెడ్డి, మహిపాల్, అశోధ అజయ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

దుర్గాదేవిని దర్శించుకున్న మంత్రి 

గొల్లపల్లి, వెలుగు: దేవి నవరాత్రుల్లో భాగంగా గొల్లపల్లి మండలకేంద్రంలోని రామాలయంలో ప్రతిష్టించిన దుర్గామాత అమ్మవారిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కమిటీ సభ్యులు మంత్రిని సన్మానించారు. రాఘవపట్నం గ్రామంలో భవాని సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి  ఉత్సవాలకు రావాలని మంత్రిని కమిటీ సభ్యులు ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నిశాంత్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సంతోష్,  వైస్ చైర్మన్ రాజిరెడ్డి, అమ్మ భవాని సేవాసమితి అధ్యక్షుడు రవి, పాల్గొన్నారు.