TRSకు ఓటు ఎందుకు వేయాలో వంద కారణాలు చెప్తాం

TRSకు ఓటు ఎందుకు వేయాలో వంద కారణాలు చెప్తాం

అబద్దాల పార్టీ బీజేపీ కావాలా?  నిబద్ధత గల టీఆర్ఎస్ కావాలా? అమ్మకాల పార్టీ పార్టీకి ఓటేస్తారా?  నమ్మకాల పార్టీకా? అని ప్రజలను ప్రశ్నించారు మంత్రి హరీశ్ రావు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం లోని చల్లూర్ లో జరిగిన ధూమ్ ధామ్ కార్యక్రమంలో పాల్లొన్న హరీశ్..ఈ సందర్భంగా మాట్లాడారు.  టీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలో వంద కారణాలు చెప్తాం..బీజేపీ కి ఎందుకు ఓటు వేయాలో ఒక్క కారణం చెప్పండి అని అన్నారు. రైతులను చంపిన పార్టీ బీజేపీ.. రైతులకు చేయూత నిచ్చింది టీఆర్ఎస్ అని అన్నారు.

అంతేకాదు..పేదలను దంచు..పెద్దలకు పంచు..బీజేపీ విధానమన్న మంత్రి హరీశ్..సంపద పెంచు.. పేదలకు పంచు... టీఆర్ఎస్ విధానమన్నారు. పేదింటి బిడ్డ గెల్లు శ్రీనుకు ఎన్నికల ఖర్చు కోసం ప్రజలే డబ్బులు ఇస్తున్నారని తెలిపారు. అమ్మకాల పార్టీ బీజేపీకి.. నమ్మకాల టీఆర్ఎస్ పార్టీకి మధ్య, అరాచకానికి-అభివృద్ధికి మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.

కేసీఆర్ తన ఇంట్లో నుండి డబ్బులు ఇస్తున్నారా అని బీజేపీ నేతలు అంటున్నారు.. మరి దేశంలో మోడీ ఇంట్లో నుండి ఇస్తున్నాడా అని అన్నారు మంత్రి హరీశ్ రావు. బీజేపీ పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలు పెంచి.. పేదల ఉసురు పోసుకుంటోందన్నారు. పది లక్షల కోట్ల రూపాయలు బడా పారిశ్రామిక వేత్తలకు రుణమాఫీ చేసిందని ఆరోపించారు. కానీ.. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు, చేనేత కార్మికులకు రుణాలు మాఫీ చేసిందన్నారు. బీజేపీ వాళ్లు కుక్కర్లు,ఫ్యాన్లు క్వార్టర్ బాటిల్ లు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు.

ఇప్పుడు జరిగేది ధర్మ యుద్ధమని..రూపాయి బొట్టు బిల్లకు,లక్ష రూపాయల కళ్యాణ్ లక్ష్మి మధ్య పోటీ జరుగుతోందన్నారు మంత్రి హరీశ్. కాళేశ్వరం నీళ్లను వీణవంక మండలంలోకి తీసుకు వచ్చిన ఘనత కేసీఆర్ దన్నారు. కాలంతో పనిలేకుండా కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చిన ఘనత టీఆర్ఎస్ దన్నారు. బీజేపీ ప్రభుత్వం రైతులకు బందుక్ లు పెడితే..టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రైతుబంధు ఇచ్చిందని తెలిపారు. పేద ప్రజల కోసం పాటుపడే వ్యక్తి కేసీఆర్ అన్న హరీశ్ ..స్వార్థ ప్రయోజనాల కోసం ఈటల రాజేందర్ రాజీనామా చేశాడని ఆరోపించారు. గెల్లు శ్రీనివాస్ గెలిస్తే  ఈ ప్రాంతానికి లాభం చేకూరుతుంది స్పష్టం చేశారు.