గవర్నర్​ మీ చేతుల్లో ఉన్నరని కౌశిక్​ ఎమ్మెల్సీని ఆపుతరా?

గవర్నర్​ మీ చేతుల్లో ఉన్నరని కౌశిక్​ ఎమ్మెల్సీని ఆపుతరా?
  • మీరు హుస్నాబాద్​లో సభ పెట్టొచ్చు గానీ సీఎం సభ పెట్టకూడదా?
  • పన్నులపై చర్చకు సిద్ధమా: బీజేపీకి మంత్రి హరీశ్ రావు సవాల్​​

హుజూరాబాద్ నుంచి ప్రత్యేక ప్రతినిధి, వెలుగు: ‘‘కౌశిక్​రెడ్డిని ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్​ నామినేట్​ చేస్తే.. గవర్నర్  మీ చేతుల్లో ఉన్నరని చెప్పి ఆపి పెట్టలేదా? ఎమ్మెల్సీ ఫైల్​ను ఎన్ని రోజులు ఆపుతరు? కేబినెట్​ ఆమోదించిన దాన్ని ఎన్నిరోజులు పరిశీలిస్తరు. దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నరు” అంటూ బీజేపీ నేతలపై మంత్రి హరీశ్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ పై కేంద్రం బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ, రోడ్డు సెస్, సర్ చార్జీ పన్నులేసి ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. శుక్రవారం హుజూరాబాద్​లో హరీశ్​ మీడియాతో మాట్లాడారు. పెట్రో ధరలు పెరగడానికి క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడమే కారణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చిగా అబద్ధాలు ఆడుతున్నారని, కేంద్రం వేస్తున్న పన్నులపై చర్చకు  రాష్ట్ర మంత్రిగా తాను వస్తానని, కేంద్ర మంత్రిగా కిషన్​రెడ్డి వస్తారా అని సవాల్​ విసిరారు.

ఈటల రాజేందర్ టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బాగుండేవారని, బీజేపీలో చేరినంక ఆ పార్టీ గాలి, వాసన ఆయనకు బాగా అంటాయని, అబద్ధాలు ఆడడం స్టార్ట్ చేశారని విమర్శించారు. ‘‘దళిత బంధు విషయంలో నేను లేఖ రాశానా అని ఈటల తెలివిగా అంటున్నడు. చెల్పూరు గుడికి వస్తా అంటున్నడు. నువు రాస్తే ఏంటి, నీ బీజేపీ రాస్తే ఏంటి. నువ్వు బీజేపీ కాదా... బీజేపీ పార్టీలో లేవా.. బీజేపీ బీఫాం మీద పోటీ చేస్తలేవా..  ఎంత తెలివిగా మాట్లాడుతున్నవు రాజేందర్’’ అని మండిపడ్డారు. అబద్ధాలు చెప్పడంలో బీజేపీ నేతలకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. పసుపు బోర్డు పేరు చెప్పి బాండ్ పేపర్ రాసిచ్చిన అర్వింద్‌‌‌‌‌‌‌‌తో చెప్పించుకునే స్థితిలో టీఆర్ఎస్ లేదని విమర్శించారు. ‘‘దళిత బంధు ఇస్తే.. ఇవ్వొద్దని లేఖ రాస్తరు. మీరు మాత్రం హుస్నాబాద్ లో ఎన్నికల కోడ్ వచ్చినా పెద్ద సభ పెట్టుకున్నరు. కేసీఆర్ వస్తరంటే అడ్డుకుంటరా. మీరు సభలు పెట్టుకోవచ్చు కేసీఆర్ సభ పెట్టకూడదా. ఇవేం రాజకీయాలు’’ అని హరీశ్ రావు ప్రశ్నించారు.