డిగ్రీలు చేసినా స్కిల్స్ లేక జాబ్​లు రావట్లేదు : మంత్రి కోమటిరెడ్డి

డిగ్రీలు చేసినా స్కిల్స్ లేక జాబ్​లు రావట్లేదు : మంత్రి కోమటిరెడ్డి
  • దేశంలో నిరుద్యోగం పెద్ద సమస్యగా మారింది: మంత్రి కోమటిరెడ్డి
  • హెచ్ఐసీసీలో యువతకు న్యాక్ సర్టిఫికెట్లు అందజేత

హైదరాబాద్, వెలుగు: దేశంలో నిరుద్యోగం పెద్ద సమస్యగా మారిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. డిగ్రీలు, పీజీలు పూర్తిచేసినా స్కిల్స్  లేకపోవటం వల్ల యువతకు జాబ్ లు రావటం లేదని తెలిపారు. బుధవారం హెచ్ఐసీసీలోని న్యాక్(నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్)లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమాన్ని మంత్రి హాజరయ్యారు. న్యాక్ లో పలు కోర్సుల్లో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న యువతకు న్యాక్ వైస్ చైర్మన్ హోదాలో సర్టిఫికేట్లు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ..ఏటా 20వేల మందికి పైగా యువతకు వివిధ కోర్సుల్లో  ట్రైనింగ్ ఇస్తున్నామన్నారు. ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆనంద్ మహీంద్ర చైర్మన్ గా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని గుర్తు చేశారు.  సినిమా టెక్నీషియన్లకు కూడా  న్యాక్ లో ట్రైనింగ్ ఇస్తామని వెల్లడించారు. నల్గొండలో ఏర్పాటు చేసిన  స్కీల్ ట్రైనింగ్ సెంటర్ లో ప్రతి ఏటా 10 వేల మందికి ట్రైనింగ్ ఇస్తూ 100 శాతం జాబ్ లు వచ్చేలా చేస్తున్నామని మంత్రి పేర్కొ్న్నారు. 

ఈ సందర్భంగా  హెచ్ఐసీసీలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను, న్యాక్ లో ఏర్పాటు చేసిన 100 కేవీ సోలార్ రూఫ్ టాప్ ను,  స్పేస్ అకాడమీ డబ్బింగ్ స్టూడియోను మంత్రి ప్రారంభించారు. మంత్రి ఆధ్వర్యంలో ఐసీఐసీఐ ఫౌండేషన్, అల్ర్టాటెక్ సిమెంట్, స్పేస్ అకాడమీ, మారి, ఆర్బస్ కంపెనీలు న్యాక్ తో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. కార్యక్రమంలో న్యాక్  డైరెక్టర్ జనరల్, ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రటరీ హరిచందన, శాంతి శ్రీ తదితురులు పాల్గొన్నారు.