మిస్​ వరల్డ్ పోటీలు తెలంగాణ బ్రాండ్​ఇమేజ్ ను పెంచుతయ్ : మంత్రి కొండా సురేఖ

మిస్​ వరల్డ్ పోటీలు  తెలంగాణ బ్రాండ్​ఇమేజ్ ను పెంచుతయ్ : మంత్రి కొండా సురేఖ

హనుమకొండ/ వరంగల్, వెలుగు: తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు, టూరిజాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు మిస్ వరల్డ్ పోటీలు మంచి అవకాశమని దేవాదాయ, అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. హైదరాబాద్ ను గ్లోబల్ డెస్టినేషన్ గా మార్చడంతోపాటు  ప్రపంచ పటంలో తెలంగాణను మల్టీ డైమెన్షనల్​ టూరిజం హబ్​గా నిలపడంలో కీలక పాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్​ ఓరుగల్లు పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం ఖిలా వరంగల్ లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం తెలంగాణకు గర్వకారణమన్నారు. 

వరంగల్  చేనేత కలంకారి దర్రీస్, జీఐ గుర్తింపు పొందిన చపాటా మిర్చి, తదితర స్టాల్స్​ఏర్పాటు చేసి, వాటి ప్రాధాన్యం గురించి మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కు వివరించామన్నారు. తెలంగాణ సంస్కృతి, టూరిజం, వారసత్వ సంపద గురించి వివరించేందుకు వరంగల్ జిల్లాను వేదికగా ఉపయోగించడం గర్వంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం మిస్ అర్జెంటీనా, మిస్ కెనడా, మిస్ పనామా, యునైటెడ్ స్టేట్స్, పరాగ్వే తదితరులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కొనియాడారు. 

కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే కేఆర్​నాగరాజు,  కుడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి, వరంగల్​ సీపీ సన్​ ప్రీత్ సింగ్, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, గ్రేటర్​కమిషనర్ అశ్వినీ  తానాజీ వాకాడే తదితరులు పాల్గొన్నారు.