మూసీ నిర్వాసితులకు న్యాయం చేస్తాం

మూసీ నిర్వాసితులకు న్యాయం చేస్తాం
  • మూసీ బ్యూటిఫికేషన్​తో నష్టపోయేవాళ్లు ఆందోళన చెందొద్దు: పొన్నం 
  • బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇండ్లు 
  • మూసీ బాధితులకు వెంటనే పంపిణీ చేసేందుకు ప్రణాళికలు 
  • హైదరాబాద్​ ఇమేజ్​ను ప్రపంచస్థాయికి తీసుకెళ్లేలా అభివృద్ధి చేస్తామని వెల్లడి 

ఎల్బీ నగర్, వెలుగు: మూసీ బ్యూటిఫికేషన్​లో భాగంగా చేపడుతున్న పనుల వల్ల నష్టపోయే కుటుంబాలకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామని, నిర్వాసితులు ఎవరూ ఆందోళన చెందొద్దని హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ ఇమేజ్ ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేలా మూసీ నది తీరాన్ని టూరిజం హబ్ గా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి విశేష కృషి చేస్తున్నారని అన్నారు.

శనివారం ఉదయం మలక్ పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాలా, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, ఇతర అధికారులతో కలిసి చంచల్ గూడ ఎక్స్ రోడ్డు వద్ద ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూసీ సుందరీకరణలో ఇండ్లను కోల్పోయినవాళ్లకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామన్నారు.

చంచల్ గూడ ఎక్స్ రోడ్డులో 284 డబుల్ బెడ్రూం ఇండ్లు ఉండగా.. వాటిలో 142 ఇండ్లు ఖాళీగా ఉన్నాయని కమిషనర్ తెలిపారు. అనంతరం వనస్థలిపురం రైతుబజార్ వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను కూడా మంత్రి పరిశీలించారు. అక్కడ 90 ఇండ్లు ఖాళీగా ఉన్నాయని, వాటిని కూడా మూసీ నిర్వాసితులకు ఇస్తామన్నారు. నిర్వాసిత కుటుంబాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి పథకం కింద లబ్ధి కలిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

జంట జలాశయాలకు గోదావరి నీటి సరఫరా కోసం రూ. 2 వేల కోట్లు కేటాయించామన్నారు. మూసీలో మురుగు నీరు లేకుండా చేసి, టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.డబుల్ బెడ్రూం ఇండ్లలో ఉంటున్న పలువురిని మంత్రి పొన్నం కలిసి మాట్లాడారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు.  

త్వరలో మూసీ నిర్వాసితుల తరలింపు.. 

సిటీలో అనేక చోట్ల మూసీ ఒడ్డుకు ఆనుకుని, కొన్ని చోట్ల నదిలో ఇండ్లు, కాలనీలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నవారిని త్వరలోనే అక్కడి నుంచి తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. మూసీ ప్రాంతం నుంచి తరలించే సుమారు 3,500 బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకోసం అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు.

ఇప్పటికే 1,650 ఇండ్లను పంపిణీకి సిద్ధం చేశారు. వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు పంపిణీ చేసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్  చైర్మన్ మల్ రెడ్డి రామిరెడ్డి, అధికారులు ఉన్నారు.