నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి పొన్నం ప్రభాకర్

నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి పొన్నం ప్రభాకర్
  • రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

భీమదేవరపల్లి/ ఎల్కతుర్తి, వెలుగు: గత ప్రభుత్వం పదేండ్లలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్​ ప్రజా పాలనలో నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇస్తున్నామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో శుక్రవారం మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా సుమారు రూ.6 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్, కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు, మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ పంపిణీ చేశారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ముల్కనూరులో విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్లు వస్తున్నాయన్నారు.

 గ్రామాలను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు హుస్నాబాద్ నియోజకవర్గంలో స్టీల్ బ్యాంక్ ప్రారంభిస్తున్నామన్నారు. నియోజకవర్గంలోని 340 హోటళ్లలో 100 చొప్పున 34 వేలు గ్లాస్ లు అందిస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు.  ఇందిరమ్మ ప్రభుత్వంలో నిరుపేదలందరికీ ఇండ్లు ఇస్తున్నామన్నారు. 

అర్హులకు ఇల్లు రాకపోతే తన దృష్టికి తీసుకురావాలన్నారు. మహిళల కోసం ప్రత్యేక పాలసీ అమలు చేస్తున్నామన్నారు. ఆర్టీసీలో ఇప్పటి వరకు 200 కోట్ల మంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించామని, దాదాపు 7 వేల కోట్లు  ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ స్నేహా శబరీష్, అడిషనల్  కలెక్టర్ వెంకట రెడ్డి, ఆర్డీవో రమేష్ రాథోడ్ వివిధ శాఖల అధికారులు, స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.