
- అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం
- జిన్నింగ్ మిల్లులతో రేపు మరోసారి చర్చలు
హైదరాబాద్, వెలుగు: వచ్చే వారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆదేశించారు. రైతులకు మద్దతు ధర అందించడంతో పాటు పత్తి కొనుగోళ్ల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. పత్తి కొనుగోళ్లలో జిన్నింగ్ మిల్లులు టెండర్లలో పాల్గొనకపోవడంతో తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు మరోసారి జిన్నింగ్ మిల్లులతో చర్చలు జరపాలని సూచించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వ అధికారులతో మార్కెటింగ్ శాఖ అధికారులు చర్చలు జరిపారు.
కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల్లో కొన్ని సడలింపులు చేయాలని కోరగా, కేంద్రం ఒకటి లేదా రెండు నిబంధనల్లో సడలింపులు ఇవ్వడానికి అంగీకరించింది. మిగిలిన నిబంధనలు యథాతథంగా అమలు చేయాలని నిర్ణయించింది. అలాగే, లింట్ శాతాన్ని ప్రతి 15 రోజులకు ఒకసారి నిర్ణయించి అమలు చేస్తామని కేంద్ర అధికారులు తెలిపారు. కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గత సీజన్‌లో అనుసరించిన విధానాన్ని ఈ ఏడాది కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.