
మన దేశంలోని చాలా సిటీల్లో డెవలప్‌మెంట్‌తోపాటే నీటి కొరత కూడా పెరుగుతోంది. ఇప్పటికే బెంగళూరు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. చెన్నై, ముంబై, కోల్‌కతాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. అయినా చాలామందిలో సహజ వనరులను కాపాడుకోవాలనే ఆలోచన లేదు. అందుకే ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎలాగైనా ఒక మార్గం వెతకాలి అనుకున్నాడు నవకరణ్ సింగ్ బగ్గా. ఆ ప్రయత్నంలో భాగంగానే తన స్టార్టప్ ద్వారా గాలి నుంచి నీళ్లు తీసే జనరేటర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చాడు.
కోల్‌కతాలో పుట్టి పెరిగిన నవకరణ్ ఫైనాన్స్, అకౌంటింగ్‌లో డిగ్రీ చేశాడు. కానీ, అతనికి చిన్నప్పటి నుంచి టెక్నాలజీ పట్ల ఆసక్తి ఉండేది. అందుకే స్కూల్ డేస్‌లోనే వీడియో క్యాసెట్ రికార్డర్‌లను (వీసీఆర్‌లు) విడదీయడం, కాలేజీ రోజుల్లో సొంతంగా కంప్యూటర్లను అసెంబుల్ చేసుకోవడం లాంటివి చేశాడు. ఆ ఆసక్తి వల్లే నవకరణ్‌కు గాలి నుంచి నీళ్లను తయారుచేసే యంత్రాలను తయారుచేయాలనే ఆలోచన వచ్చింది. ‘‘వాస్తవానికి మనం ఇప్పటికే నీటి సంక్షోభంలో ఉన్నాం. ఉన్న నీళ్లు కూడా అసమానంగా పంపిణీ అవుతున్నాయి.
కొంతమందికి అవసరమైన దానికంటే ఎక్కువ నీళ్లు అందుతున్నాయి. కొన్ని గ్రామాల్లో ప్రజలు కలుషిత నీటిని తాగాల్సి వస్తోంది” అంటున్నాడు నవకరణ్. అందరికీ స్వచ్ఛమైన నీటిని అందించాలనే లక్ష్యంతో 2017లో గాలి నుంచి తాగునీటిని ఉత్పత్తి చేయగల యంత్రాలను రూపొందించాలి అనుకున్నాడు. ఆ ఉద్దేశంతోనే ‘ఆక్వో అట్మాస్ఫియరిక్ వాటర్ సిస్టమ్స్’ పేరుతో ఒక స్టార్టప్ పెట్టాడు.
గాలి నుంచి నీళ్లు : పెట్టుబడిదారుల ఇన్వెస్ట్‌మెంట్స్ తీసుకోకుండా, ప్రభుత్వం నుంచి గ్రాంట్లు పొందకుండా కంపెనీ పెట్టాడు. పైపులైన్లు, భూగర్భ జలాలను వెలికితీసే పని లేకుండానే సురక్షితమైన నీటిని అందించవచ్చని నిరూపించాడు నవకరణ్. పొడిగా కనిపించే వాతావరణంలో కూడా ఎంతో తేమ ఉంటుంది. ఆ తేమని నీటిగా మార్చి ఒడిసిపట్టేందుకు అతని స్టార్టప్ ద్వారా ‘అట్మాస్పియర్ వాటర్ జనరేటర్లు’ తయారుచేశారు. ఈ మెషీన్ ముందుగా ఫ్యాన్ ద్వారా పరిసరాల్లోని గాలిని లోపలికి తీసుకుంటుంది. అందులోనుంచి దుమ్ము, కలుషితాలను తొలగించేందుకు లోపల ప్రత్యేకంగా ఒక ఫిల్టర్ ఉంటుంది. అందులో శుభ్రమైన గాలి కూలింగ్ చాంబర్‌లోకి వెళ్తుంది. అక్కడ బాగా చల్లబడుతుంది. సాధారణంగా ఏదైనా కూల్‌డ్రింక్ బాటిల్‌ని ఫ్రిడ్జ్‌లో నుంచి తీస్తే.. కాసేపటివరకు దానిమీద చెమటలు పట్టినట్టు నీటి బిందువులు ఏర్పడతాయి. అంటే బాటిల్ చల్లదనానికి గాలిలోని తేమ చల్లబడి బాటిల్‌పై నీరులా చేరుతుంది. సరిగ్గా అదే ప్రక్రియలో ఈ జనరేటర్ తేమను నీటిగా మారుస్తుంది. తర్వాత ఆ నీటిని ఫుడ్ -గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్‌లోకి పంపిస్తారు. అనేక దశల్లో శుద్ది చేసిన తర్వాత మళ్లీ కార్బన్ ఫిల్టర్‌లోకి పంపి మిగిలిపోయిన అవశేషాలు, వాసన పోయేలా శుభ్రం చేస్తారు. చివరగా అల్ట్రా వయొలెట్ (యూవీ) ట్రీట్‌మెంట్ ద్వారా బ్యాక్టీరియా, వైరస్‌లను న్యూట్రలైజ్ చేస్తారు. రుచి, పోషకాల కోసం కాల్షియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన మినరల్స్‌ని కలుపుతారు. అప్పుడు ఆ నీటిని తాగొచ్చు.
సొంతంగా పెట్టుబడి: ఈ ఆక్వోని ప్రస్తుతం 38 మంది కలిసి నడుపుతున్నారు. వాళ్లే ఇందులో పూర్తిగా పెట్టుబడి పెట్టారు. “బయటి నుంచి ఇన్వెస్ట్‌మెంట్లను తీసుకుంటే మాకు టార్గెట్లు పెడతారు. లాభాలను పెంచాలని ఒత్తిడి చేస్తారు. అందుకే బయటి ఇన్వెస్ట్మెంట్లకు దూరంగా ఉన్నాం” అన్నాడు నవకరణ్. కంపెనీ క్లయింట్లకు రెండు విధాలుగా ఈ సిస్టమ్‌ని అమ్ముతోంది. మొదటిది డైరెక్ట్‌గా డబ్బులు తీసుకుని మెషనరీ ఇన్‌స్టాల్ చేయడం. రెండో విధానంలో డబ్బులు తీసుకోకుండానే క్లయింట్ సైట్‌లో సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేస్తారు. క్లయింట్ ఎన్ని నీళ్లు వాడుకుంటున్నాడు అనేదాన్ని బట్టి ప్రతినెలా బిల్లు కడతాడు. రోజుకు 50 లీటర్ల కెపాసిటీ ఉండే చిన్న యూనిట్ల నుంచి రోజుకు 30 వేల లీటర్ల వరకు ఉత్పత్తి చేసే ఇండస్ట్రియల్ సెటప్‌లు కూడా తయారుచేస్తున్నారు. ముంబైలోని ఒక హాస్పిటల్‌లో ఆక్వోని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత నీటి ఖర్చు 22 శాతం తగ్గిందని నవకరణ్ చెప్పాడు.
పరిష్కారం దొరికింది: గుజరాత్‌లో కాస్మొటిక్స్, ఫార్మాస్యూటికల్స్ కోసం డెకరేటివ్ గ్లాస్ తయారుచేసే కంపెనీ పీజీపీ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఈ ఆక్వో జనరేటర్‌ని ఇన్‌స్టాల్ చేశారు. ఆ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్న సుదీష్ మీనన్ మాట్లాడుతూ ‘‘మేము పర్యావరణ అనుకూల విధానాల్లో స్వచ్ఛమైన నీటిని ఎలా పొందాలి? అని సెర్చ్ చేస్తున్నప్పుడు మాకు ఆక్వో గురించి తెలిసింది. వెంటనే ఇన్‌స్టాల్ చేయించాం. ఈ సిస్టమ్ చాలా సమర్థవంతంగా పనిచేస్తోంది. నీటి వృథా ఉండదు. మెయింటెనెన్స్ చాలా తక్కువ. ఇప్పుడు అదే మా సిబ్బందికి ప్రతిరోజూ స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తోంది” అని చెప్పుకొచ్చాడు.
కోర్‌వైర్ సర్ఫేస్ టెక్నాలజీ అనే కంపెనీలో కూడా ఈ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేయించుకున్నారు. ‘‘ప్లాస్టిక్, ఫ్యూయెల్ వినియోగాన్ని తగ్గించడానికి మా దగ్గర కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. కానీ.. నీటి విషయానికి వస్తే మేము ప్రతిరోజూ బయటి నుంచి బాటిళ్లను కొనేవాళ్లం. ఆ పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చేందుకు ఆక్వోని ఇన్‌స్టాల్ చేయించాం” అని చెప్పాడు కంపెనీ సేల్స్ ఆఫీసర్ సబిన్.
వేడిగా ఉండే ప్రాంతాల్లో: ‘‘నీటి వనరులు తక్కువగా ఉండే ప్రాంతాల్లో మా ఆక్వో వాటర్ జనరేటర్లు నీటిని సృష్టించగలవు. ముఖ్యంగా చెన్నై, ముంబై, బెంగళూరు, కోల్‌కతా లాంటి సిటీలతోపాటు తేమ స్థాయిలు ఎక్కువగా ఉండే ఉష్ణమండల, తీర ప్రాంతాల్లో ఇవి బాగా పనిచేస్తాయి. ఒక యూనిట్ కరెంట్‌తో నాలుగు లీటర్ల నీళ్లను ఉత్పత్తి చేయొచ్చు. బెంగళూరు లాంటి తేమ తక్కువగా ఉండే ప్రదేశాల్లో మాత్రం యూనిట్‌కు రెండున్నర లీటర్లు మాత్రమే వస్తాయి. ఇవి ఇంట్లోని సాధారణ కరెంట్, సోలార్ ప్యానెల్ లేదా డీజిల్ జనరేటర్లతో కూడా నడుస్తాయి” అంటున్నాడు నవకరణ్.
15 దేశాల్లో ఇన్‌స్టాలేషన్స్: నవకరణ్ 2018లో మొదటి ఆక్వో వాటర్ జనరేటర్‌ని మార్కెట్‌లోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు కంపెనీ దక్షిణ భారతదేశం నుంచి దక్షిణ అమెరికా వరకు విస్తరించింది. 15 దేశాల్లో 2 వేల కంటే ఎక్కువ సిస్టమ్స్‌ని ఇన్‌స్టాల్ చేసింది. మన దేశంలో బెంగళూరు, చెన్నై, ముంబై, గోవా, కోల్‌కతా, అహ్మదాబాద్‌ల్లో ఈ జనరేటర్లు ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా యుఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఫిలిప్పీన్స్, దక్షిణ అమెరికాలోని చిలీ, ఈక్వెడార్, కొలంబియా లాంటి అనేక దేశాల్లో ఇన్‌స్టాలేషన్ చేశారు. భవిష్యత్తులో మరిన్ని దేశాలకు విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మెషీన్లు ఇప్పటివరకు భూమి నుంచి ఒక్క చుక్క నీరు కూడా తీసుకోకుండా వంద మిలియన్ లీటర్లకు పైగా స్వచ్ఛమైన తాగునీటిని ఉత్పత్తి చేశాయి.