మెగా జాబ్ మేళాకు నిరుద్యోగుల వెల్లువ : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

మెగా జాబ్ మేళాకు నిరుద్యోగుల వెల్లువ : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • హుజూర్‌‌నగర్‌‌లో జాబ్ మేళా ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 
  • వేరే ప్రాంతాల్లో జాబ్ మేళాలు ఉండటంతో నేటి జాబ్ మేళా వాయిదా

సూర్యాపేట/హుజూర్ నగర్, వెలుగు:  గ్రామీణ ప్రాంత యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో హుజూర్ నగర్‌‌లో ఏర్పాటు చేసిన మెగా జాబ్‌ మేళా కు అనూహ్య స్పందన వచ్చింది. శనివారం హుజూర్‌‌నగర్‌‌లోని పెరల్స్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన మెగా జాబ్‌ మేళాను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. దాదాపు 40 వేల మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. మొదటి రోజు 25 వేల మందికి పైగా హాజరయ్యారు. 

దాదాపు 275  కంపెనీలు జాబ్ మేళాలో  పాల్గొన్నాయి. పరిశ్రమల శాఖకు అనుబంధంగా ఉన్న డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ, సింగరేణి కాలరీస్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని శనివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. మొదటి రోజు దాదాపు 4 వేల మంది నిరుద్యోగులను ఎంపిక చేయగా వారికి మంత్రి ఉత్తమ్ జాయినింగ్ ఆర్డర్స్ అందించారు. 

10  వేల మంది పోలీసులతో బందోబస్తు 

మెగాజాబ్‌ మేళాలో 40 వేల మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పోలీస్ శాఖ భారీ బందోబస్త్ ఏర్పాటు చేసింది.  ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల నుంచి సుమారు 10 వేల మంది సిబ్బందిని భద్రతా ఏర్పాట్ల కోసం నియమించారు. డీఐజీ చౌహన్, ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, సూర్యాపేట ఎస్పీ నరసింహ, నల్గొండ ఎస్పీ చరత్ చంద్ర పవార్ భద్రతను పర్యవేక్షించారు. 

4574 మందికి ఉద్యోగాలు 

హుజూర్ నగర్, వెలుగు: హుజూర్ నగర్ లో నిర్వహించిన జాబ్ మేళాకు అనూహ్య  స్పందన లభించిందని  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం మంత్రి క్యాంప్ కార్యాలయంలోమాట్లాడారు..  జాబ్ మేళాలో 259 కంపెనీలు,20,463 మంది అభ్యర్థులు పాల్గొన్నారని తెలిపారు. 4,574 మంది వివిధ ప్యాకేజీల కింద సెలెక్ట్ అయ్యారన్నారు. 3,041 మందికి నియామక పత్రాలు అందజేసినట్లు చెప్పారు. వేరే ప్రాంతాల్లో జాబ్ మేళాల కారణంగా హుజూర్ నగర్‌‌లో నేటి జాబ్ మేళా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. 

గ్రామీణ ప్రాంత నిరుద్యోగుల కోసమే

గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా హుజూర్‌‌నగర్‌‌లో మెగా జాబ్‌ మేళాను నిర్వహించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.  హుజూర్‌‌నగర్ లో నిర్వహించిన మెగా జాబ్ మేళా తెలంగాణలోనే అతి పెద్దదన్నారు. దీని వల్ల హుజూర్‌‌నగర్, కోదాడ నియోజకవర్గాలు, ఉమ్మడి నల్గొండ జిల్లా నిరుద్యోగులకు ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు.    

నా కల నెరవేరింది ఫొటోగ్రఫీ శిక్షణ తీసుకునే అవకాశం దక్కింది 

మెగా జాబ్ మేళాతో ఫోటోగ్రఫీ శిక్షణ తీసుకునేందుకు అవకాశం దక్కింది. పదో తరగతి పూర్తి చేసిన నాకు స్కిల్ స్టడీ అకాడమీ ఎంపిక చేసుకొని స్కాలర్ షిప్ తో  శిక్షణనిచ్చి ఉద్యోగం కల్పించేందుకు ముందుకు వచ్చింది. గ్రామీణ ప్రాంతాలలో ఇలాంటి జాబ్ మేళా నిర్వహించడం ఆనందాన్ని కలిగించింది. - సంజయ్ యాదవ్, హుజూర్ నగర్    

జాబ్ మేళా  ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది  

ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థినిగా ఉన్న నాకు మెగా జాబ్ మేళా జీవితంలో కొత్త ఆత్మ విశ్వాసాన్ని ఇచ్చింది.  స్పర్థ లెర్నింగ్ ఐటీ కంపెనీ తొలి ప్రయత్నం లోనే ఎంపిక చేసుకోవడం గొప్పగా అనిపించింది. కోఆర్డినేటర్‌‌గా ఎన్నిక కావడం నా కెరియర్‌‌లో మంచి మలుపుగా భావిస్తున్నాను.  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధన్యవాదాలు చెబుతున్నాను. కావేరీ, నల్లగొండ జిల్లా భీమారం