రైతులకు ఇబ్బందులు రావొద్దు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రైతులకు ఇబ్బందులు రావొద్దు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • ప్రణాళిక ప్రకారం ఆయకట్టుకు నీళ్లివ్వండి..అధికారులకు మంత్రి ఉత్తమ్​ ఆదేశాలు
  • కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల్లో నీటి నిల్వల ఆధారంగా శాస్త్రీయ విధానాలు రెడీ చేయండి
  • ఎస్​ఎల్​బీసీ పెండింగ్ పనులు వెంటనే ప్రారంభించాలని సూచన

హైదరాబాద్, వెలుగు: వానాకాల సీజన్​లో రైతులకు ఇబ్బందిలేకుండా ప్రాజెక్టుల నుంచి నీటిని సరఫరా చేయాలని అధికారులను ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఆదేశించారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వల ఆధారంగా సాగుకు నీళ్లందించాలని, రైతులకు ఇబ్బందులు రానివ్వొద్దని స్పష్టం చేశారు. రియల్​టైం డేటా, పంటల రకాలు, ఆయకట్టు తదితర అంశాల ఆధారంగా నీటి విడుదల వ్యూహాలను అమలు చేయాలన్నారు. కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టుల్లో నీటి నిల్వలను బట్టి.. నీటి వినియోగంపై శాస్త్రీయ, ప్రాక్టికల్​ ప్రణాళికలను సిద్ధం చేయాలని ఇరిగేషన్​ శాఖ ముఖ్యకార్యదర్శి, ఇంజనీర్​ ఇన్​ చీఫ్​లను ఆయన ఆదేశించారు.

గత వానాకాలం, యాసంగి సీజన్లలో అధికారులు సమన్వయంతో పనిచేశారని.. ఫలితంగా రికార్డు స్థాయిలో 2.81 కోట్ల టన్నుల వరిధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. తద్వారా దేశంలోనే అత్యధిక వరి దిగుబడి సాధించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ఆయన పేర్కొన్నారు. గత సీజన్ల మాదిరిగానే ఇప్పుడు కూడా జిల్లా కలెక్టర్లు, ఫీల్డ్​ స్టాఫ్​తో అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు.

సెక్రటేరియెట్​లో శనివారం అధికారులతో మంత్రి ఉత్తమ్​ రివ్యూ సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో అధికారులు సన్నద్ధంగా ఉండాలని, భారీ వర్షాలు పడితే తీసుకోవాల్సిన చర్యలపై ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు. డ్యాములు, రిజర్వాయర్లతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.  

రివ్యూ మీటింగ్​కు తొలిసారి కల్నల్​ పరీక్షిత్​ మెహ్రా

మంత్రి ఉత్తమ్​ చేపట్టిన రివ్యూ మీటింగ్​లో తొలిసారిగా కల్నల్​ పరీక్షిత్​ మెహ్రా పాల్గొన్నారు. ఆయనను టన్నెల్​ నిర్మాణాల్లో  సలహాదారుగా  తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, ఎస్​ఎల్బీసీ ప్రాజెక్టులో సమస్యగా మారిన సాంకేతిక సవాళ్లను కల్నల్​ పరీక్షిత్​ మెహ్రా విజయవంతంగా అధిగమిస్తారని మంత్రి ఉత్తమ్​ ధీమా వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టుల్లో పూడికతీత పనులను త్వరగా చేపట్టాలని ఆదేశించారు. దేవాదుల ప్రాజెక్టులోని మూడు, ఆరు ప్యాకేజీల పనుల రివైజ్డ్​ ఎస్టిమేట్స్​పైనా సమావేశంలో చర్చించినట్టు తెలిసింది.

వచ్చే కేబినెట్​లో దీనిపై ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​ భూముల ఆక్రమణల సమస్యలనూ పరిష్కరించుకోవాలని, వాలంతరీ (వాటర్​ అండ్​ ల్యాండ్​ మేనేజ్​మెంట్​ ట్రైనింగ్​ అండ్​ రీసెర్చ్​ ఇనిస్టిట్యూట్​), ఇంజనీరింగ్​ రీసెర్చ్​ లేబొరేటరీ (ఈఆర్​ఎల్​) భూములను కబ్జా చెర నుంచి విడిపించాలని స్పష్టం చేశారు. కాగా, రెండు నెలల్లో డీఈఈల నుంచి ఈఎన్​సీల వరకు పెండింగ్​లో ఉన్న ప్రమోషన్లను పూర్తి చేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు.

ఎస్​ఎల్​బీసీపై ఫోకస్​ పెంచండి

రాష్ట్రానికి  ఎస్​ఎల్బీసీ ప్రాజెక్టు అత్యంత కీలకమని, ఆ ప్రాజెక్టులో మిగిలిపోయిన పనులను అత్యంత ప్రాధాన్యంతో పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్​ ఆదేశించారు. మిగిలిన 10 కిలోమీటర్ల టన్నెల్​ తవ్వకం పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. డ్రిల్లింగ్​, బ్లాస్టింగ్​ పద్ధతిలో టన్నెల్​ పనులను ప్రారంభించే విషయంపై దృష్టి సారించాలని ఆయన  సూచించారు. నేషనల్​ జియోఫిజికల్​ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​ (ఎన్​జీఆర్​ఐ), జియోలాజికల్​ సర్వే ఆఫ్​ ఇండియా (జీఎస్​ఐ)తో కలిసి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్​ సర్వే చేయించాలన్నారు. వీలైనంత త్వరగా లైడార్​ సర్వే పనులను చేపట్టాలని స్పష్టం చేశారు. ఇప్పటికే సాంకేతిక విధివిధానాలను ఖరారు చేయాల్సిందిగా ఎన్​జీఆర్​ఐ సైంటిస్టులను కోరినట్టు ఆయన చెప్పారు. ఖర్చు సమస్య కాదని, నాణ్యత పాటిస్తూనే వేగంగా పనులను పూర్తి చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు.