
-
రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులు శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
వనపర్తి, వెలుగుః అంతర్జాతీయ ప్రమాణాలతో నూతనంగా నిర్మించనున్న మినీ స్టేడియాలతో అమరచింత, ఆత్మకూరు మున్సిపాలిటీల రూపు రేఖలు మారిపోనున్నాయని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం అమరచింత, ఆత్మకూరు మున్సిపాలిటీలలో కొత్తగా నిర్మించనున్న క్రీడా మైదానాలకు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి స్థలాలను పరిశీలించారు. అమరచింతలోని హైస్కూల్ ఆవరణలో రూ.2 కోట్లతో నిర్మించనున్న మినీ స్టేడియం స్థలాన్ని పరిశీలించారు.
ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో జాతర మైదానం పక్కన అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మినీ స్టేడియం, జాతర మైదానంలో మరో ఇండోర్ స్టేడియం కోసం ప్రణాళికలు సిద్ధం చేసి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వీటి నిర్మాణాలకు దాదాపు రూ.5 కోట్ల నిధులను కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రత్యేక చొరవ తీసుకొని 4 ఎకరాల స్థలాన్ని కేటాయించారన్నారు. ఆగస్టు 25న హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియం టెన్నిస్ క్యాంప్లెక్స్ లో నిర్వహించనున్న సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్ పోస్టర్‌ను మంత్రి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
క్రీడాభివృద్ధికి పెద్ద పీట: మేఘారెడ్డి
వనపర్తి జిల్లా రానున్న కాలంలో క్రీడలకు పుట్టినిల్లుగా మారబోతుందని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎండీ సోనీ బాల పేర్కొన్నారు. వనపర్తి మెడికల్ కాలేజీ పక్కన గల ఎనిమిదిన్నర ఎకరాల్లో క్రీడా మైదానం, బాయ్స్ జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో స్విమ్మింగ్ పూల్, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ, డిగ్రీ కాలేజీ పక్కన ఉన్న మైదానంలో హాకీ టర్ఫ్ మైదానం, శ్రీనివాసపురం శివారులో 35 ఎకరాల్లో క్రీడా పాఠశాల ఏర్పాటుకు స్థలాలను పరిశీలించారు.