
కోనరావుపేట,వెలుగు: జిల్లాలో సాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఇరిగేషన్ అధికారులతో కలిసి మల్కపేట రిజర్వాయర్ కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్కపేట రిజర్వాయర్ కుడికాల్వ ద్వారా వేములవాడ నియోజకవర్గంలోని 12 గ్రామాలకు, వేములవాడ మండలం మారుపాక వరకు నీటిని విడుదల చేశామన్నారు.
ధర్మారం గ్రామంలో 4 మెగావాట్ల సోలార్ పవర్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం మంజూరు చేసినట్లు చెప్పారు. కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ ఎల్లయ్య, వైస్ చైర్మెన్ ప్రభాకర్, మండల అద్యక్షుడు ఫిరోజ్ పాష, అధికారులు అమరేందర్ రెడ్డి, కిశోర్, సత్యనారాయణ, వినోద్, శ్రీనివాస్, శేషాద్రి, తదితరులు పాల్గొన్నారు.
వేములవాడ, వెలుగు : వేములవాడ పట్టణ పరిధిలోని శాత్రాజ్‌పల్లిలో రూ. కోటి 43 లక్షలతో నిర్మించనున్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి, తిప్పాపూర్ బస్టాండ్ నుంచి చెక్ డ్యామ్ వరకు సుందరీకరణ పనులకు విప్ ఆది శ్రీనివాస్ , కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాత్రాజుపల్లిలో 30 పడకల ఆసుపత్రి నిర్మిస్తే చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
తిప్పాపూర్ నుంచి మూలవాగు ఎడమ వైపు రూ.80 లక్షలతో సుందరీకరణ పనులను ప్రారంభించినట్లు చెప్పారు. త్వరలో రాజన్న ఆలయం, పట్టణంలో రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించించనున్నట్లు తెలిపారు. వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, వైస్ చైర్మన్ రాకేశ్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, చంద్రగిరి శ్రీనివాస్‌గౌడ్, బింగి మహేశ్, తిరుపతిరెడ్డి, అధికారులుపాల్గొన్నారు.