మత్తడి దుంకుతున్న గంధమల్ల చెరువు : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

మత్తడి దుంకుతున్న గంధమల్ల చెరువు : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
  • గంగమ్మ తల్లికి పూజలు చేసిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు : తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామంలో చెరువు మత్తడి దుంకుతోంది. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మంగళవారం మత్తడి దుంకుతున్న గంధమల్ల చెరువుకు వద్దకు వెళ్లి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. చెరువులో పూలు చల్లి, కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చారు. గంగమ్మకు చీర, పసుపు కుంకుమతో సారె సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గ రైతుల సాగునీటి కష్టాలు తీర్చే గంధమల్ల చెరువు నిండి అలుగు పారుతుండడం సంతోషంగా ఉందన్నారు.

 గంధమల్ల చెరువు నిండితే తుంగతుర్తి వరకు భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు. గంధమల్ల చెరువును రిజర్వాయర్ గా మార్చడానికి ప్రభుత్వం రూ.600 కోట్లు శాంక్షన్ చేసిందని చెప్పారు. గంధమల్ల రిజర్వాయర్ కోసం ఇప్పటికే భూసేకరణ పూర్తి చేశామని, త్వరలోనే రిజర్వాయర్ నిర్మాణ పనులు చేపట్టి రైతుల సాగునీటి కష్టాలను శాశ్వతంగా పారద్రోలుతామని పేర్కొన్నారు. మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ చైతన్యామహేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి, తహసీల్దార్ దేశ్యానాయక్, మాజీ ఎంపీటీసీ మోహన్ బాబు నాయక్, రాజాపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.