
స్టేషన్ ఘన్‌పూర్, వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. మున్సిపాలిటీ కార్యాలయ భవనం, టౌన్ హాల్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సీసీ రోడ్లు, సైడ్ కాల్వలు, రోడ్డు వెడల్పు వంటి పనులు చేపడుతామన్నారు. మున్సిపాలిటీలో 100 పడకల ఆస్పత్రి, డివిజనల్ ఆఫీస్, డిగ్రీ కళాశాల ఏర్పాటుతో రూపు రేఖలు మారుతాయని తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో దేవాదుల 3వ దశ ప్యాకేజీ 6 పనులను సవరించిన అంచానాలతో రూ.1,001 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీశ్ రెడ్డి, చిల్పూర్ దేవస్థాన కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.