తాడ్వాయి, వెలుగు: తాడ్వాయి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో గురువారం ఎమ్మెల్యే మదన్మోహన్అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. తాడ్వాయి, బ్రహ్మణపల్లిలో అంగన్‌వాడీ భవనాలకు, నందివాడలో పంచాయతీ భవనానికి భూమి పూజ చేశారు. సోమారం గ్రామంలో అంగన్‌వాడీ భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తాడ్వాయిలో ఇందిరమ్మ ఇల్లును ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ఆధునిక హంగులతో అంగన్‌వాడీ భవనాలను నిర్మిస్తున్నామన్నారు. తాడ్వాయిలో మినీ స్టేడియం కోసం క్రీడా మంత్రి శ్రీహరితో కలిసి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించామని, స్థల పరిశీలన చేసిన అధికారులు నీటి లభ్యత సమస్య కారణంగా ఫైల్‌ను తిరిగి పంపారని తెలిపారు.
కలెక్టర్‌తో మాట్లాడి నీటి సరఫరా చేసేలా తాను స్వయంగా బాధ్యత తీసుకుంటానన్నారు. గత ప్రభుత్వ హయాంలో బ్రహ్మణపల్లి గ్రామానికి ఒక్క డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కూడా మంజూరు కాలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే 31 ఇండ్లు మంజూరయ్యాయని, అందులో 21 ఇండ్ల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్మండలాధ్యక్షుడు వెంకటరెడ్డి, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు గైని శివాజీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్, ఏఎంసీ వైస్ ప్రెసిడెంట్ జక్కుల రాజిరెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ మెట్టు చంద్రం, యూత్ టౌన్ ప్రెసిడెంట్ రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.
