
అచ్చంపేట, వెలుగు: గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గిరిజన జల వికాసం పథకానికి రూ.12,600 కోట్ల నిధులు కేటాయించినట్లు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. బుధవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో పార్టీ నేతలు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జల వికాసం పథకాన్ని ప్రారంభించేందుకు ఈ నెల 18న వస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు శ్రేణులు సిద్ధం కావాలని సూచించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు తరలి రావాలన్నారు.
ఐకేపీ ఆధ్వర్యంలో ఏపీఎం, సీసీలు మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించి బహిరంగ సభకు మహిళలు వచ్చేలా చూడాలని సూచించారు. వాటికి సంబంధించిన ఏర్పాట్లను సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ చట్టం కింద కేటాయించిన భూములను సాగులోకి తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. ఆర్థికంగా బలోపేతం చేసేందుకు 2.10 లక్షల మంది గిరిజన రైతులకు చెందిన 6 లక్షల ఎకరాలకు విద్యుత్, సాగునీటి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.