
నారాయణపేట, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ఆదేశించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఫిబ్రవరిలో అప్పక్‌పల్లిలో భూమిపూజ చేసిన ఇందిరమ్మ ఇంటితో పాటు గ్రామంలోని ఇండ్ల పనులను బుధవారం కలెక్టర్ పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని లబ్ధిదారులతో పాటు హౌసింగ్ పీడీ శంకర్‌కు సూచించారు. అనంతరం సింగారం చౌరస్తాలో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంక్ ను పరిశీలించి, రోజుకు ఎన్ని లీటర్ల పెట్రోల్, డీజిల్ అమ్ముతున్నారు?
సిబ్బంది జీతాలు పోగా నెలకు ఎంత లాభం వస్తుందని జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు చంద్రకళను అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్ బంక్ ఆర్థిక లావాదేవీల రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. అంతకుముందు మండలంలోని అప్పక్ పల్లి సమీపంలోని మెడికల్ కాలేజీని సందర్శించారు. కాలేజీ ఆవరణలో రూ. 26 కోట్లతో నిర్మించనున్న నర్సింగ్ కాలేజీ కోసం స్థలం, రూ. 24 కోట్లతో నిర్మించే ఎంసీహెచ్(మదర్ అండ్ చైల్డ్ హెల్త్) సెంటర్ స్థలాన్ని పరిశీలించారు.
అనంతరం మెడికల్, కాలేజీల్లో క్లాస్‌రూమ్స్‌కు వెళ్లి తరగతుల నిర్వహణను పర్యవేక్షించారు. నర్సింగ్ విద్యార్థినులతో మాట్లాడారు. కాలేజీ ప్రిన్సిపాల్ రాంకిషన్, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో మాట్లాడారు. డీఆర్డీవో మొగులప్ప, డీఈ కృష్ణమూర్తి, ఏఈ సాయి మురారి, ఎంపీడీవో సుదర్శన్ పాల్గొన్నారు.