వంగూరు మండలంలో అభివృద్ధి పనులు స్పీడప్​ చేయాలి : కలెక్టర్ బదావత్ సంతోష్

వంగూరు  మండలంలో అభివృద్ధి పనులు స్పీడప్​ చేయాలి : కలెక్టర్  బదావత్  సంతోష్

వంగూరు, వెలుగు: అభివృద్ది పనులు స్పీడప్​ చేయాలని నాగర్ కర్నూల్  కలెక్టర్  బదావత్  సంతోష్  ఆదేశించారు. బుధవారం మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో కలెక్టర్  సమావేశం నిర్వహించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పంచాయతీరాజ్, ఆర్అండ్​బీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు లేన్ల రోడ్​ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

 పాలశీతలీకరణ కేంద్రం కొత్త బిల్డింగ్, ప్రతి ఇంటికి సోలార్  విద్యుత్  కల్పించే పనులను పూర్తి చేయాలన్నారు. సీసీ రోడ్ల నిర్మాణం, అండర్  గ్రౌండ్  డ్రైనేజీ, స్ట్రీట్​ లైట్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని సూచించారు. పిల్లల పార్క్, ఓపెన్  జిమ్  పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర వ్యవసాయ కమిషన్  సభ్యుడు కేవీఎన్ రెడ్డి,ఎస్పీ వైభవ్  రఘునాథ్  గైక్వాడ్, ఆర్డీవో శ్రీనివాసులు, గ్రామ ప్రత్యేక అధికారి విజయ్ కుమార్  పాల్గొన్నారు.

మాచారంలో ఏర్పాట్ల పరిశీలన

అమ్రాబాద్: మండలంలోని మాచారం గ్రామంలో ఇందిరా సౌర గిరి జల వికాస పథకం ప్రారంభోత్సవ ఏర్పాట్లను బుధవారం అడిషనల్​ కలెక్టర్  దేవసహాయం, ఎస్పీ వైభవ్  గైక్వాడ్  రఘునాథ్ తో కలిసి కలెక్టర్  బదావత్  సంతోష్  పరిశీలించారు. ఈ నెల18న సీఎం, డిప్యూటీ సీఎం ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. సభా వేదిక పనులు పరిశీలించి, భద్రత, పార్కింగ్​ ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని సూచించారు. హెలిపాడ్  ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. లబ్ధిదారుల భూముల్లో వేయించిన బోర్లు, సోలార్  పంప్​సెట్లను పరిశీలించారు, ఆర్వోఫ్ఆర్  భూముల్లో మొక్కలను నాటాలని ఆదేశించారు. 17లోగా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. డీఆర్డీవో చిన్న ఓబులేషు, డీపీవో రామ్మోహన్ రావు, ఆర్డీవో మాధవి పాల్గొన్నారు.

వడ్ల తరలింపులో జాప్యంపై ఆగ్రహం..

నాగర్ కర్నూల్ టౌన్: వడ్ల తరలింపులో జాప్యంపై కలెక్టర్  బదావత్  సంతోష్  ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నాగర్ కర్నూల్  మండలం వనపట్ల కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. రైతుల నుంచి సేకరించిన వడ్లు, మిల్లులకు తరలించిన వడ్ల వివరాలను అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోళ్లలో ఆలస్యం చేస్తున్నారని రైతులు చెప్పడంతో, నిర్వాహకుల తీరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బంది పెట్టే సెంటర్లను బ్లాక్​ లిస్ట్​లో పెట్టాలని అధికారులకు సూచించారు.