పోడు రైతులను ఇబ్బంది పెడితే ఊరుకోం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

పోడు రైతులను ఇబ్బంది పెడితే ఊరుకోం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
  • కవ్వాల్ టైగర్ జోన్ లో చెక్ పోస్టులు  ఎత్తి వేయాలి 
  • అటవీ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే  వెడ్మ బొజ్జు పటేల్ 

ఖానాపూర్, వెలుగు: అటవీ శాఖ అధికారులు అమాయక ఆదివాసీ ప్రజలతో పాటు ఎస్సీ, బీసీ, మైనారిటీ ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.  హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో జిల్లా ఇన్ చార్జి, అటవీ శాఖ మంత్రులు సీతక్క, సురేఖ  అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ  ప్రజలను అటవీ శాఖ అధికారులు ఇబ్బందులకు గురి చేసి అక్రమ కేసులు పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు.  క్షేత్రస్థాయిలో  వెళ్లి సమస్యలు చూసి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. 

ఇందిరా సౌర గిరి జల వికాసం పథకంలో మంజూరైన బోరు బావులను వేయడానికి తప్పనిసరిగా అనుమతులు ఇవ్వాలన్నారు. కవ్వాల్ టైగర్ జోన్‌లో  భారీ వాహనాలకు అనుమతులు ఇవ్వాలన్నారు.  అటవీ శాఖ ఆఫీసర్లు అమాయక ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తే తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు.