
- బీఆర్ఎస్ నాయకులపై ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మండిపాటు
నల్గొండ అర్బన్, వెలుగు: రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్‌ఎస్ నాయకులు సోయి లేకుండా మాట్లాడుతున్నారని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డితో కలిసి బీఆర్‌ఎస్ బాకీ కార్డుల పోస్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎలాంటి అభివృద్ధి చేయకుండా ప్రాజెక్టుల పేరుతో పేదల సొమ్మును దోచుకుతిందని విమర్శించారు.
అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. అధికారం కోల్పోయిన తర్వాత ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న జగదీశ్ రెడ్డిని గొల్లగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటనే అడ్మిట్ చేయాలన్నారు. తిప్పర్తిలో ఆరు గ్యారెంటీలపై విడుదల చేసిన కార్డుపై నల్గొండ సెంటర్లో చర్చకు రావాలని సవాల్ విసిరారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విమర్శించే స్థాయి మీకు లేదన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని స్థానాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని పేర్కొన్నారు. సమావేశంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేశ్, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనుఫ్ రెడ్డి, ధర్వేశిపురం దేవాలయ కమిటీ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.