సీఎంఆర్’పై మిల్లర్ల మీనమేషాలు

సీఎంఆర్’పై మిల్లర్ల మీనమేషాలు
  • ఉమ్మడి జిల్లాలో 1,28,277 టన్నులు పెండింగ్​
  • డెలివరీలో నల్గొండ ముందంజ
  • సూర్యాపేట వెనుకంజ
  • వచ్చే నెల 12 వరకు సీఎంఆర్ గడువు పొడిగింపు

యాదాద్రి, వెలుగు : వానాకాలం –2024 కష్టమ్స్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) అప్పగించడంలో మిల్లర్లు మీనమేషాలు లెక్కిస్తున్నారు. గడువు పెంచినా బియ్యాన్ని అప్పగించడం లేదు.  ఏడాది కావస్తున్నా ఆ సీజన్​కు సంబంధించిన బియ్యం అందించలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎంఆర్ గడువును పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. నల్గొండ మిల్లర్లు సీఎంఆర్​ను స్పీడ్​గా డెలివరీ చేస్తుంటే ఎప్పటిలాగానే సూర్యాపేట వెనుకంజలో ఉంది. ఈ రెండు జిల్లాల కంటే ఎక్కువ వడ్లు తీసుకున్న యాదాద్రి మిల్లర్లలో కొందరు మినహా మిగతావారు ఫాస్ట్​గానే డెలివరీ చేస్తున్నారు. 

మళ్లీ వానాకాలం వచ్చినా..

వానాకాలం –2024 సీజన్​లో ఉమ్మడి జిల్లాలోని మిల్లులకు సీఎంఆర్​కోసం 6,67,074 టన్నుల వడ్లను అప్పగించారు. ఇందుకు 4,50,700 టన్నుల బియ్యాన్ని సీఎంఆర్ కింద మిల్లర్లు అప్పగించాల్సి ఉంది. అయితే 2024–-25 యాసంగి సీజన్​వడ్లను సీఎంఆర్​కు అప్పగించి నెలలు గడుస్తోంది. ఇప్పుడు 2025 వానాకాలం నడుస్తోంది. సీఎంఆర్​ కోసం కేంద్రం ఇచ్చిన గడువు మే 31తోనే ముగిసింది. 

అయినా మిల్లర్లు పూర్తి స్థాయిలో బియ్యం అప్పగించకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 1,28,277 టన్నులు డెలివరీ చేయాల్సి ఉంది. గడువు పొడిగించాలని సివిల్ సప్లయ్ ఆఫీసర్లు కేంద్రానికి పలుమార్లు లేఖలు రాయగా, సెప్టెంబర్​ 12 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

సూర్యాపేట వెనుకంజ..

ఇక సూర్యాపేట మిల్లర్లు మాత్రం సీఎంఆర్​అప్పగించడంలో ఎప్పటిలాగానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రెండు జిల్లాల కంటే సూర్యాపేట మిల్లర్లకు సీఎంఆర్​ కోసం తక్కువ వడ్లను కేటాయించారు. అప్పగించిన 1,68,791 టన్నులకు 1,13,736 టన్నుల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు 52,020 (46 శాతం) టన్నులు మాత్రమే ఇచ్చారు. ఎక్కువ వడ్లను తీసుకున్న నల్గొండ, యాదాద్రి జిల్లాలతో పోలిస్తే తక్కువ వడ్ల తీసుకున్న సూర్యాపేట మిల్లర్లు సీఎంఆర్​తక్కువగా అప్పగించారు. 

2024 వానాకాలంలో జిల్లాలవారీగా సీఎంఆర్​ వివరాలు (టన్నుల్లో)

  జిల్లా             ఇచ్చిన వడ్లు    ఇవ్వాల్సిన సీఎంఆర్​    డెలివరీ                పెండింగ్​
యాదాద్రి         2,75,839            1,50,710                        1,03,685                  46,908
నల్గొండ    2     22,444               1,86,265                        1,66,612                   19,653
సూర్యాపేట     1,68,791            1,13,736                        52,020                      61,716