పంచాయతీ కార్యదర్శులతో వెట్టి చాకిరి

పంచాయతీ కార్యదర్శులతో వెట్టి చాకిరి

పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో జూనియర్​ పంచాయతీ కార్యదర్శులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లోని అన్ని పనులనూ వీరికే అప్పగిస్తున్నా.. వారికి సరైన గుర్తింపును మాత్రం ఇవ్వడం లేదు. పైగా రాజకీయ జోక్యం కారణంగా వీరిపై భౌతిక దాడులు కూడా పెరిగి తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. రాజకీయ, మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఇప్పటికే ఎంతో మంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. అయినా పంచాయతీ కార్యదర్శులను పట్టించుకునే వారు కనిపించడం లేదు.

టీఆర్ఎస్ ప్రభుత్వం 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జూనియర్​ పంచాయతీ కార్యదర్శుల(జేపీఎస్) నోటిఫికేషన్​ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ పరిశీలిస్తే అనేక ఆశ్చర్యకర విషయాలు కనిపిస్తాయి. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా ఎగ్జామ్స్ పెట్టారు. టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ లో లేని నెగెటివ్ మార్కింగ్ విధానం తీసుకొచ్చి వడపోసి మరీ జేపీఎస్​లను సెలెక్ట్ చేశారు. పే స్కేల్ లేకుండా రూ.15 వేల జీతంతో మూడేండ్ల ప్రొబెషనరీ పీరియడ్ తో ఏటా బాండ్ సమర్పించేలా నయా వెట్టిచాకిరీకి తెరదీశారు. సాధారణంగా ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా మొదట శిక్షణ ఇచ్చి కార్యశాలకు పంపిస్తారు. కానీ జేపీఎస్ లకు ఎలాంటి శిక్షణ లేకుండానే గ్రామాల్లో వదిలేశారు. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా గ్రామ సభలు, లోకల్ బాడీ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక(జీపీడీపీ)లో సమర్థంగా పనిచేసినా ఎవరూ పట్టించుకోలేదు. ఇంకుడు గుంతలు, బాత్రూమ్​ల నిర్మాణం పేరుతో ప్రతి ఇంటి గడప తొక్కే భాగ్యం కలిగింది. ఆ తర్వాత చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆ తర్వాత పల్లె ప్రగతిలో సర్పంచ్, పాలకవర్గం, ఎంపీటీసీలు పాల్గొనేలా సమన్వయం చేస్తూ సక్సెస్​ చేశారు. రెండో విడత పల్లె ప్రగతిలో భాగంగా డంపింగ్ యార్డ్, శ్మశాన వాటికల నిర్మాణం జరిగేలా చూశారు. ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మెకు వెళ్లడం వల్ల వారిని సస్పెండ్​ చేసిన ప్రభుత్వం.. ఉపాధి హామీ పనుల బాధ్యతలను జేపీఎస్ లకు  అప్పగించింది. అప్పటి వరకు సర్పంచ్ కు, పంచాయతీ కార్యదర్శికి ఉన్న చెక్ పవర్ తీసేసి కార్యదర్శిని ఉత్సవ విగ్రహంగా మార్చారు. 
 

అందరి టార్గెట్​ జేపీఎస్ లే
గ్రామ స్థాయిలో రాజకీయ వాతావరణం ఏ మాత్రం బాగా లేకున్నా కార్యదర్శులను టార్గెట్ చేసి దూషణలు, దాడులకు దిగుతున్నారు. దాడులు చేసిన వారిపై కేసులు పెట్టడం లేదు. రాజకీయ, మానసిక ఒత్తిడి కారణంగా పదుల సంఖ్యలో పంచాయతీ కార్యదర్శులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల నాగర్ కర్నూలు జిల్లాలో జూనియర్ పంచాయతీ సెక్రెటరీ రాజకీయ ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న ఘటన మన కళ్ల ముందే జరిగింది. ప్రభుత్వ ఉద్యోగంలో ఆదర్శ పని పరిస్థితులు ఉంటాయని, పేదవారికి ఉపయోగపడతామనే ఆదర్శాలతో వస్తే రాజకీయ నాయకులతో చీవాట్లు, కొందరి సూటిపోటి మాటలతో ఎన్నో అగచాట్లు ఎదుర్కొంటూ తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తున్నారు. కరోనా సంక్షోభంతో గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను సక్రమంగా జరిగేలా చూశారు. ఆస్తుల సర్వే కూడా తలకు మించిన భారమైనా విజయవంతంగా పూర్తి చేసారు. మూడు, నాలుగో విడత పల్లె ప్రగతిని అమలు చేశారు.
 

కార్యదర్శుల వల్ల రాష్ట్రానికి పేరు, అవార్డులు
జేపీఎస్​లు చేసిన కార్యక్రమాల వల్ల తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో పేరుతో పాటు అనేక అవార్డులు వచ్చాయి. రోజూ అనేక కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ పనులు చేస్తున్న మమ్మల్ని పై అధికారులు కొత్త మార్పుల పేరుతో ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా డైలీ శానిటేషన్ రిపోర్ట్ లో భాగంగా రోజూ 7 గంటలకే వెళ్లి ట్రాక్టర్ డ్రైవర్ పక్కన కూర్చొని ఫొటో తీసి అప్​లోడ్ చేయమనడం ఎంత వరకు సమంజసం? వాట్సాప్ లో మెసేజ్ చూడకపోయినా మెమోలు ఇస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని కార్యక్రమాలనూ విజయవంతం చేసిన మమ్మల్ని ఎవరూ గుర్తించట్లేదు. వెట్టిచాకిరి చేసే బానిసలుగా చూస్తున్నారు. చేసే పనికి, తీసుకునే జీతానికి పొంతన లేదనేదే మా బాధ. సీఎం అసెంబ్లీలో మాట్లాడుతూ గ్రామాల్లో ఒక్క మొక్క ఎండితే సర్పంచ్, సెక్రటరీ సస్పెండ్ అవుతారని చేసిన స్టేట్మెంట్​ ప్రభావం చాలా దారుణంగా ఉంది. 

ఉద్యోగ భద్రత కల్పించాలి
కరోనా సంక్షోభం సమసిన తర్వాతైనా మమ్మల్ని గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పే స్కేల్  ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలి. నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా ప్రొబెషనరీ పీరియడ్  మూడేండ్లు పూర్తి కాగానే పే స్కేల్ ఇవ్వాలి. ప్రతి జూనియర్ పంచాయతీ సెక్రెటరీకి ఆరోగ్య బీమా కల్పించాలి. కార్యదర్శులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. ప్రతి పంచాయతీకి ఒక కంప్యూటర్ ను ఇచ్చి ఆపరేటర్ ను నియమించాలి. డీఎస్ఆర్ యాప్ ను ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకే అనుమతించాలి. మానవతా దృక్పథంతో ఆలోచించి సమస్యలకు పరిష్కారం చూపేలా ముఖ్యమంత్రి చొరవ చూపాలి. 

                                                                                                                                                                                           - ఆర్ భాస్కర్ రెడ్డి, రాష్ట్ర జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఫోరం