యూరియాపై ప్రతిపక్షాల డ్రామాలు : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

యూరియాపై ప్రతిపక్షాల డ్రామాలు : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

యాదగిరిగుట్ట, వెలుగు : రాష్ట్రంలో యూరియాపై బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు డ్రామాలకు తెరలేపారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. యూరియా విషయంలో బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు అవగాహన లేకుండా మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ‌‌‌‌‌‌‌‌ఆదివారం యాదగిరిగుట్టలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ ప్లాంట్ ను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంపీలందరూ కలిసి పార్లమెంట్ లో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, కేంద్ర మంత్రి నడ్డాతో చర్చలు జరిపి రాష్ట్రానికి 50 వేల మెట్రిక్ టన్నుల యూరియాను మంజూరు చేయించామన్నారు. వ్యవసాయ సాగుకు సరిపడా యూరియాను కేంద్రం పంపించకపోవడం వల్లే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సర్ ప్లస్ యూరియా పంపించిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడుతున్నారని చెప్పారు. 

మరోవైపు కాంగ్రెస్ ను దూషించడమే పనిగా పెట్టుకున్న హరీశ్ రావు యూరియాపై దుష్ప్రచారానికి తెరలేపారని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ కలిసి ఆడుతున్న డ్రామాతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో దేశప్రజల చేతిలో బీజేపీకి భంగపాటు తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ వో మనోహర్, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ చైతన్యామహేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, మాజీ ఉప సర్పంచ్ భరత్ గౌడ్, మాజీ కౌన్సిలర్ మల్లేశ్ యాదవ్, టౌన్ ప్రెసిడెంట్ భిక్షపతి, మండల వైద్యాధికారి డాక్టర్ పావని, సీహెచ్ వో వెంకటయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఆంజనేయులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.