
- క్వాలిటీ పట్టించుకోలే.. ఇష్టమొచ్చినట్లు కట్టిన్రు: ఎంపీ వంశీకృష్ణ
- ఒక్క ఎకరాకూ నీరు అందలేదు
- కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో కాలనీలు మునుగుతున్నయ్
- గ్రామాల్లో తిరిగితేనే కేటీఆర్‌కు ప్రజల కష్టాలు తెలుస్తయ్
- మంచిర్యాల, చెన్నూరు ముంపు ప్రాంతాల్లో పర్యటన
కోల్‌బెల్ట్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాకుండా పోయిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. కమీషన్ల కోసమే ప్రాజెక్ట్ కట్టారని ఆరోపించారు. క్వాలిటీ గురించి పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లు నిర్మించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ లీడర్ల అనాలోచిత నిర్ణయాలతో వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందన్నారు. కాళేశ్వరంతో ఆయకట్టుకు చుక్క నీరు అందలేదని, బ్యాక్ వాటర్‌తో ఏటా వేల ఎకరాల్లో పంటలు, మంచిర్యాలలోని కాలనీలు మునిగిపోతున్నాయని తెలిపారు.
మంచిర్యాల, చెన్నూరులోని ముంపు ప్రాంతాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరికి వరద పెరిగి జైపూర్ మండలం వేలాల, కిష్టాపూర్, శివ్వారం, ఫౌనూర్ గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలు, మంచిర్యాలలో గోదావరి తీర ప్రాంతాలను, మాతా శిశు ఆస్పత్రిని కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి పరిశీలించారు. ప్రభుత్వపరంగా ఆదుకుంటామని పంట నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చారు. అనంతరం ఎంపీ వంశీకృష్ణ మీడియాతో మాట్లాడారు.
‘‘లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాకుండా పోయింది. రూ.20 కోట్లతో మంచిర్యాలలో నిర్మించిన మాతా శిశు హాస్పిటల్ ను ఖాళీ చేయాల్సి వస్తున్నది. ఆస్పత్రి నిర్మాణానికి సరైన స్థలాన్ని ఎంపిక చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. ప్రతి ఏటా వరదలు రావడంతో ఆస్పత్రిలోని గర్భిణులు, బాలింతలను వేరే హాస్పిటల్స్‌కు షిఫ్ట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ లీడర్లకు బాలింతలు, గర్భిణుల ఉసురు తాకింది. హాస్పిటల్ నిర్మాణానికి ప్లానింగ్ చేసిన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలి. ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తినప్పుడల్లా కింద ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కారణంగా వేల ఎకరాల పంటపొలాలు, కాలనీలు ముంపునకు గురవుతున్నాయి’’అని ఎంపీ వంశీకృష్ణ పేర్కొన్నారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో తిరిగితే బాధలు తెలీవని, గ్రామాల్లో తిరిగితేనే ప్రజలు పడుతున్న కష్టాలు తెలుస్తాయని కేటీఆర్‌కు ఎంపీ వంశీకృష్ణ సూచించారు. ‘‘ప్రజా సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నది. వరదలతో నష్టపోయిన ప్రాంతాలు, అక్కడి ప్రజల బాధలు తెలుసుకొని ఆదుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కృషి చేస్తున్నారు. వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ అండగా నిలుస్తున్నరు. ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరికి వరద తాకిడి పెరిగింది.
దీంతో జైపూర్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో సుమారు 1,300 ఎకరాల్లో పంటలు మునిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టంపై సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలి. రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పిస్తాం”అని ఎంపీ వంశీకృష్ణ హామీ ఇచ్చారు.
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి
లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్‌ను ఎంపీ వంశీకృష్ణ ఆదేశించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి దిగువకు 8 లక్షల క్యూసెక్కుల వరదనీరు చేరిందని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం సమన్వయంతో పని చేస్తున్నదని ఎంపీకి కలెక్టర్ వివరించారు.
అంతకు ముందు ఇటీవల పిడుగుపాటుకు గురై గాయాపాలై మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కోటపల్లి మండలం సర్వాయిపేట రైతు దుర్గం రాజమల్లును ఎంపీ వంశీకృష్ణ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. నస్పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎంపీ సందర్శించారు. కాకా వెంకటస్వామి ట్రస్ట్ తరఫున హాస్పిటల్‌కు కుర్చీలు అందజేశారు.