తెలంగాణపై కేంద్రం ద్వేషం : పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ

తెలంగాణపై కేంద్రం ద్వేషం : పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ
  • రాష్ట్రానికి అన్యాయం చేస్తే ఊరుకోం: పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ
  • బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటామని వెల్లడి
  • ధర్మపురి, పెద్దపల్లిలో పర్యటన 

జగిత్యాల/పెద్దపల్లి, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై ద్వేషంతో వ్యవహరిస్తోందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ మండిపడ్డారు. తెలంగాణకు రావాల్సిన నిధులు నేటికీ ఇవ్వడం లేదన్నారు. ఈ సమస్యలపై పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. తెలంగాణకు అన్యాయం చేస్తే సహించమని ఎంపీ హెచ్చరించారు. బుధవారం ధర్మపురి నియోజకవర్గంలో ఎంపీ పర్యటించారు. వెల్గటూర్ మండలంలోని అంబారీపేటలో మీడియాతో మాట్లాడారు. “గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది.

 కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. లక్షల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రైతులకు ఉపయోగం లేకుండా పోయింది. ఆ ప్రాజెక్టు నీళ్ల అవసరం లేకుండానే లక్షా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకోవాలి” అని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టు అంశం పై మాట్లాడుతూ.. “ఏపీ సీఎం చంద్రబాబు కమీషన్ల కోసమే బనకచర్ల ప్రాజెక్టు కట్టాలని చూస్తున్నారు. 

తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోం. ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటాం” అని హెచ్చరించారు. అంతకుముందు వెల్గటూర్‌‌‌‌లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మెరుగు నరేశ్​ గౌడ్ తల్లి మృతి వార్త తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

సింగరేణి కార్మికుల సమస్యలపై పోరాడుతా

కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తానని ఎంపీ వంశీకృష్ణ అన్నారు. సింగరేణి కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, రిటైర్డ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పార్లమెంటులో పోరాడుతానని పేర్కొన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్​ సీనియర్ నాయకుడు ఈర్ల కొమురయ్య సతీమణి శోభారాణి పదవి విరమణ సభలో ఎంపీ పాల్గొన్నారు. అనంతరం రామగిరి మండలంలోని అడ్రియాల గని పోచమ్మ బోనాల్లో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. 

ఈ సందర్బంగా ఎంపీ  మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమం కోసం ఆనాడు కాకా వెంకటస్వామి ఎంతో కృషి చేశారని, కాకా స్ఫూర్తి తో తాను ముందుకు సాగుతున్నానని తెలిపారు. అదే విధంగా తన బాధ్యతగా సింగరేణి కార్మికుల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటానన్నారు. రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంపు కోసం ప్రత్యేకంగా కృషి చేసినట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.