
నార్త్‌లో ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ సౌత్‌లోనూ మెప్పించాలని ఆశపడుతుంటారు కొందరు బాలీవుడ్ హీరోయిన్స్. ఈ వరుసలో మరొకరు చేరారు. సూపర్ 30, బాట్లా హౌస్, తూఫాన్ లాంటి చిత్రాలతో హిందీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్ ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో మృణాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆదివారం తన బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడంతో పాటు తన క్యారెక్టర్ పేరుని కూడా రివీల్ చేశారు. దుల్కర్ లెఫ్టినెంట్ రామ్‌గా నటిస్తుంటే, తనకి జంటగా సీత పాత్రలో కనిపించనుంది మృణాల్. ఇదో పీరియాడికల్ లవ్ స్టోరీ. 1964లో జరిగిన ఇండో, చైనా వార్ బ్యాక్‌డ్రాప్‌లో తీస్తున్నారు. దీంతో అప్పటి కట్టు, బొట్టుతో వింటేజ్ లుక్‌లో ఉంది మృణాల్. ఆమె అద్దం ముందు రెడీ అవుతుంటే వెనుక నుండి ఫొటో తీస్తున్నాడు దుల్కర్. ఒకరి కళ్లలోకి మరొకరు చూస్తున్న ఈ లుక్ ఆకట్టుకుంటోంది. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కచ్చితంగా ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుందని చెబుతున్నారు మేకర్స్. ఈ మూవీని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.