ఆక్సిజన్ సప్లైలో ముంబై భేష్

ఆక్సిజన్ సప్లైలో ముంబై భేష్

స్టోరేజ్ ట్యాంకుల ఏర్పాటు
సప్లై, నిర్వహణకు స్పెషల్ టీంలు
బీఎంసీ ప్రత్యేక చర్యలతో 
తగ్గిన ఆక్సిజన్ కొరత

ముంబై: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ లో కేసులు, డెత్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఆక్సిజన్ దొరకక ఇప్పటికే వేల మంది మృత్యువాతపడ్డారు. అయితే ఆక్సిజన్ సప్లై విషయంలో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) చేపట్టిన ప్రత్యేక చర్యలతో ముంబై సిటీలో ఇప్పుడు ఆక్సిజన్ కొరత పూర్తిగా తీరిపోయింది. దీంతో ముంబై మోడల్ ను అమలు చేసే విషయాన్ని పరిశీలించాలంటూ ఇటీవల ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచించింది. 
సిటీలో 21 స్టోరేజీ ట్యాంకులు 
ముంబైలోని హాస్పిటల్స్ కు రోజూ 210 టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతుంది. కరోనా పీక్ స్టేజీలో ఉన్నప్పుడు 260 టన్నుల వరకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం రోజూ 240 టన్నుల ఆక్సిజన్ కు డిమాండ్ ఉంది. అయితే ఫస్ట్ వేవ్ పాఠాలతో బీఎంసీ ముందుగానే సెకండ్ వేవ్ కు సిద్ధమైంది. సిటీలోని ఆయా ప్రాంతాల్లో నిమిషానికి 13 వేల లీటర్ల ఆక్సిజన్ ను సప్లై చేసే 11 ట్యాంకులను ఏర్పాటు చేసింది. 10 మేజర్ హాస్పిటల్స్ వద్ద నిమిషానికి 10 వేల లీటర్ల ఆక్సిజన్ ను సప్లై చేసే ట్యాంకులను ఇన్ స్టాల్ చేసింది. సిటీలో ఆక్సిజన్ స్టోరేజీ ఫెసిలిటీలను పెంచాలని గుర్తించిన తాము.. 40 రోజుల్లోనే వీటిని ఏర్పాటు చేశామని బీఎంసీ అడిషనల్ మున్సిపల్ కమిషనర్ పి. వెల్ రసు చెప్పారు.  
చిన్న ఆస్పత్రులకు సిలిండర్లు 
పెద్ద దవాఖాన్ల వద్ద ఆక్సిజన్ స్టోరేజ్ ట్యాంకులను ఏర్పాటు చేసిన బీఎంసీ.. చిన్న ఆస్పత్రులకు ఎక్కువ సమయం పాటు ఆక్సిజన్ ను అందించే లో ప్రెజర్ లిక్విడ్ సిలిండర్లను అందుబాటులోకి తెచ్చింది. చిన్న నర్సింగ్ హోంలు, దవాఖాన్లకు ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి. 
ప్రతి వార్డుకు ఓ స్పెషల్ టీం 
ముంబైలోని హాస్పిటల్స్ లో ఆక్సిజన్ సప్లై, వినియోగాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా బీఎంసీ.. సిటీలోని 24 వార్డులకు 24 స్పెషల్ టీంలను ఏర్పాటు చేసింది. ఆక్సిజన్ లీకేజీలను అరికట్టడం, ట్రాన్స్ పోర్ట్ సజావుగా సాగేలా చూసే బాధ్యతలు కూడా ఈ టీంలకే అప్పగించారు. ఎక్కడైనా ఆక్సిజన్ అంచనా కంటే ఎక్కువ ఖర్చు అయినా.. అందుకు కారణాలు తెలుసుకుని, సరిదిద్దే పని కూడా ఈ టీంలు చూస్తున్నాయి. ఆక్సిజన్ కావాల్సిన హాస్పిటల్స్ కనీసం 3 గంటలు ముందుగా సమాచారం ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. మొత్తంగా స్టోరేజ్, సప్లై, మేనేజ్ మెంట్ పక్కాగా చేస్తుండటంతో ముంబై సిటీలో ఇప్పుడు ఆక్సిజన్ కొరత తగ్గిందని బీఎంసీ అధికారులు చెప్తున్నారు.