మున్సిపాలిటీ ఓటరు జాబితా తప్పుల కుప్ప.. డబుల్ ఎంట్రీ.. కొన్ని ఓట్లు మిస్సింగ్..

మున్సిపాలిటీ ఓటరు జాబితా తప్పుల కుప్ప.. డబుల్ ఎంట్రీ.. కొన్ని ఓట్లు మిస్సింగ్..
  • ఒక డివిజన్​ ఓట్లు మరో డివిజన్​లో ప్రత్యక్షం
  • చనిపోయినోళ్లకూ ఓట్లు.. బతికి ఉన్నోళ్ల ఓట్లు గల్లంతు  
  • కొన్ని చోట్ల డబుల్ ఓట్లు నమోదు 
  • ఇంటి ఓనర్​కు తెలియకుండానే ఇంటి నంబర్​పై ఓట్లు 
  • అధికారులకు ఫిర్యాదుల వెల్లువ

ఈ ఫొటోలో సర్కిల్ లో కనిపిస్తున్న మహిళ పేరు శారద. ఆమె రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 45వ డివిజన్ చంద్రశేఖర్ నగర్ లో నివాసముంటూ పీహెచ్ సీలో నర్సుగా పనిచేస్తున్నారు. ఈమె ఫొటోను 40వ డివిజన్ ఎల్బీ నగర్ లో 66 ఏళ్ల  గౌరు రాజమ్మ పేరు దగ్గర చేర్చారు. ఇలా ఒక్కో డివిజన్ లో ఒక్కొక్కరి పేరు రెండు, మూడు సార్లు నమోదయ్యాయి.

చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో పిట్టల భూమయ్య అనే వ్యక్తికి డబుల్ ఓట్లు వచ్చాయి. వాస్తవానికి భూమయ్య తన ఫొటో తప్పుగా ఉందని, దానిని మార్చాలని కొద్దికాలం క్రితం అప్లికేషన్ పెట్టుకున్నారు. ఫొటో మాత్రమే అప్ డేట్ చేయాల్సి ఉండగా పాత ఓటు అలాగే ఉంచి.. కొత్త ఫొటోతో కొత్త ఓటును నమోదు చేశారు. 

కరీంనగర్/నెట్ వర్క్, వెలుగు: మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని వార్డులు, డివిజన్లలో శుక్రవారం ప్రదర్శించిన ముసాయిదా ఓటరు జాబితాలు తప్పులతడకగా ఉన్నాయి. కొన్ని మున్సిపాలిటీల్లో ఒక వార్డు ఓట్లు మరో వార్డులో ప్రత్యక్షమయ్యాయి. కొన్ని చోట్ల జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లోని గ్రామాల ఓట్లు పట్టణ ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. 

రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో చనిపోయినవాళ్ల ఓట్లను జాబితా నుంచి తొలగించకపోగా.. బతికి ఉన్నోళ్ల ఓట్లు గల్లంతయ్యాయి. మరికొన్ని చోట్ల ఒక్కరికే రెండు, మూడు ఓట్లు నమోదయ్యాయి. జాబితాలో ఒకరి ఫొటోకు బదులు మరొకరి ఫొటోలు ప్రింట్ అయ్యాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ, మహబూబ్ నగర్ మున్సిపాలిటీలోని శివశక్తి నగర్ లోని ఇంటి ఓనర్ కు తెలియకుండానే గుర్తు తెలియని వ్యక్తుల పేర్లను ఓటర్లుగా చేర్చారు. 

భూపాలపల్లి పట్టణంలో ఇళ్లు లేకపోయినా ఇంటి నంబర్లతో సుమారు 5 ‌‌ఓట్లు జాబితాలో వచ్చాయి. రాజకీయ పార్టీల నాయకులు ఫిర్యాదులు  అందజేస్తున్నారు. ఈ నెల 6 వరకు ఆఫీసర్లు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. 
    
జమ్మికుంట మున్సిపాలిటీ 28వ వార్డులో ఇంటి నంబర్ 7–7–137/1 యజమాని అల్లం చంద్రయ్య తన ఇంట్లో కుటుంబ సభ్యులు కాకపోయినా తమకు సంబంధం లేని 6 ఓట్లు నమోదయ్యాయని మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. 30వ వార్డులో సుమారు 300 డబుల్ ఓట్లు ఉన్నాయని, మృతిచెందిన వారి ఓట్లు 100కు పైగా ఉన్నట్లు గుర్తించారు. 
    
చొప్పదండి ఓటర్ లిస్టులో కొందరికి ఓటరు తండ్రి పేరు, భర్త పేరు పేర్కొనలేదు. మరికొందరి ఓటర్లలో భర్త, తండ్రి పేరు స్థానంలో ఇంటి పేరు నమోదు చేశారు. తెలుగు జాబితాలో ఓటర్ పేరు హిందీలో, ఇంటి పేరు తెలుగులో, తండ్రి పేరు వద్ద ఇంటి పేరు వచ్చింది. చనిపోయిన వారి పేర్లు తొలగించలేదు.
    
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్​లో 3వ వార్డులోని దాదాపు 170 మంది ఓటర్లను 15వ వార్డులోకి, 8వ వార్డుకు చెందిన 200 మంది ఓటర్లను 7వ వార్డులోకి షిఫ్ట్ చేశారు. ఒక్కో వార్డులో దాదాపు 20 మంది వరకు చనిపోయిన వారి పేర్లు వచ్చాయి. లిస్ట్ లో ఒక్కో ఓటరు పేర్లు రెండు సార్లు వచ్చాయి. 
    
మెదక్ మున్సిపాలిటీలో 5వ వార్డు ఓటర్ల జాబితాలో ఆ వార్డు పరిధిలో లేని గాంధీ నగర్ వీధికి చెందిన 14 మంది ఓటర్ల పేర్లు ఉన్నాయి. 
    
నల్లగొండ మున్సిపాలిటీలో పద్మావతి నగర్​, ఆర్టీసీ కాలనీ, గొల్లగూడ, శ్రీనగర్​ కాలనీ తదితర ప్రాంతాల్లో భారీగా ఓట్లు గల్లంతయ్యాయి. ఒక వార్డు పరిధిలోని పోలింగ్​ కేంద్రాల ఓటర్లు మరొక వార్డుల్లోకి చేం జ్​ అయ్యారు. దీంతో 41 వార్డులో 3 వేల మంది ఓటర్లకు గాను కేవలం 1,500 మాత్రమే ఉన్నాయి. గొల్లగూడలో 42 వార్డులో దాదాపు 1,200 ఓట్లు వేరొక వార్డులోకి మారిపోయాయి. 
    
మిర్యాలగూడ మున్సిపాలిటీలో 42వ వార్డుకు చెందిన 300 ఓట్లను 43వ వార్డులో చేర్చారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో 46వ వార్డులోని 200 మందిని 41వ వార్డులోకి చేర్చారు. హుజూర్ నగర్ మున్సిపాలిటీలో 2వ వార్డుకు సంబంధించి 101 ఓట్లను 27వ వార్డులోకి మార్చారు.
    
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 22వ వార్డులో 2–150/1 నుంచి సబ్ నంబర్లతో ఇండ్లల్లో నివాసం లేని 500 మందికి ఓటు హక్కు కలిగి ఉన్నట్లుగా జాబితాలో చూపించారు. 2-91 నుంచి 2–91/46 వరకు ఇళ్లు లేకున్నా ఫేక్ నంబర్లతో ఓట్లు కలిగి ఉన్నారు. సింగరేణి కార్మిక కుటుంబాలకు చెందిన చాలా మంది ఓట్లు గల్లంతయ్యాయి. 8వ వార్డు జవహర్ నగర్ కాలనీలో.. ఈ వార్డుతో సంబంధం లేని వారిని ఓటర్లుగా నమోదు చేశారు. 
    
మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో కొత్త గంజి 38వ డివిజన్ పరిధిలోకి వస్తుంది. కొత్త గంజిలోని మధ్య భాగాన్ని పక్క డివిజన్​లో చేర్చారు. శివశక్తి నగర్ లోని ఒకే ఇంటి నంబర్ మీద నలుగురు గుర్తు తెలియని ఓటర్లను చేర్చారు.
    
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మధుర నగర్ కాలనీలో నివాసముంటున్న ఓటర్లను ఖానాపూర్ మున్సిపాలిటీలోని 6వ వార్డులో నమోదు చేశారు.
    
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వార్డులను పునర్విభజించకుండా ఆర్ అండ్ ఆర్ కాలనీలోని ఓటర్లను వివిధ వార్డుల్లో సర్దుబాటు చేయడంపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మల్లన్న సాగర్ 8 గ్రామాల నిర్వాసితుల కోసం నిర్మించిన ఆర్ అండ్ ఆర్ కాలనీ గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఉంది. ఎనిమిది నిర్వాసిత గ్రామాల్లో దాదాపు 12 వేల మంది ఓటర్లు ఉన్నారు. 
    
నాగర్​ కర్నూల్​ జిల్లా కల్వకుర్తి మునిసిపాలిటీలో ఫొటోలు లేని ముసాయిదా ఓటర్​ లిస్టును ప్రదర్శించారు. ఓటర్​ లిస్ట్​ ఇంగ్లిష్​లో ఉండటం, అక్షరాలు చిన్నగా ఉండటం కూడా సమస్యగా మారింది. నాగర్​ కర్నూల్​ మునిసిపాటిలీలో 45, కల్వకుర్తి మున్సిపాలిటీ 15 ఫిర్యాదులు వచ్చాయి. 
    
ములుగు మున్సిపాలిటీ 20వ వార్డు ఓటర్లను 8వ వార్డులోకి మార్చారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డుల్లో ఇతర ఓటర్లను చేర్చారు. 
    
ఆదిలాబాద్ పట్టణంలోని 32వ వార్డులో గ్రామీణ ప్రాంతాలైన మావల, బట్టిసావర్గాంతో పాటు గుడిహత్నూర్ మండలంలోని గొండుహర్కాపూర్ గ్రామానికి చెందిన ఓటర్లను చేర్చారు. రణదీవేనగర్ వార్డు ఓటర్ల జాబితాలో శాంతినగర్, బంగారుగూడ, అనుకుంట కాలనీల ఓటర్లను చేర్చారు. 

కరీంనగర్ సిటీలో ఇతర జిల్లాలు, గ్రామాల ఓటర్లు..

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 7వ డివిజన్​లో 1,275 ఓట్లు వేరే గ్రామాల అడ్రస్​తో నమోదయ్యాయి. సిద్దిపేట జిల్లా బెజ్జంకి, హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి, వంగర, కరీంనగర్ జిల్లా సైదాపూర్, తిమ్మాపూర్, మొగిలిపాలెం, ఇందుర్తి, చిగురుమామిడి, చెల్పూర్, ఇల్లందకుంట, కొత్తపల్లి మండలం బద్దిపల్లి, సైదాపూర్, బెజ్జంకి, దండేపల్లి తదితర గ్రామాల పేర్లు ఓటర్ల అడ్రసులుగా చూపిస్తున్నాయి. మంకమ్మతోట, కిసాన్ నంబర్, వావిలాలపల్లి, భాగ్యనగర్ కు చెందిన కొన్ని ఓట్లు విద్యానగర్ లోని 21వ డివిజన్ లిస్టులో నమోదు చేశారు. 28, 8వ డివిజన్లోనూ ఇదే పరిస్థితి.