- ఫారెస్ట్ అధికారుల తీరుపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడి అసహనం
ఇంద్రవెల్లి, వెలుగు: ఆదివాసీలను ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెట్టడం సరైందికాదని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ పేర్కొన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం కుమ్మరికుంట గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఫారెస్ట్ అధికారులు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోకుండా అడ్డుపడుతున్నారని గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఆదివాసీలను ఫారెస్ట్ ఆఫీసర్లు ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. మానవీయ కోణంలో ఆలోచించాలని, స్వేచ్ఛగా బతికేలా అవకాశం కల్పించాలన్నారు. అనంతరం ఇంద్రవెల్లి మండలం హర్కాపూర్, మచ్చపూర్, కేస్లాపూర్ గ్రామాల్లో పర్యటించారు. ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్టీలకు ఏ సమస్యలు ఉన్నా ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కమిషన్ కోర్టు లాంటిదని తెలిపారు.
అధికారులు సమన్వయంతో పని చేస్తూ ప్రజలకు సేవలందించాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు అటవీ శాఖ మంత్రులు ఉన్నప్పటికీ, ఈ ప్రాంతానికి ఏం మేలు చేశారని ప్రశ్నించారు.
అనంతరం ఉట్నూర్ ఐటీడీఏ ఆఫీస్ ఎదుట కొలాం గిరిజనులు చేపట్టిన రిలే నిరహార దీక్ష శిబిరానికి వెళ్లి వారికి నిమ్మ రసం తాపించి దీక్షలు విరమింప జేశారు. ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, ఏఎస్పీ మౌనిక, ఎస్సీ, ఎస్టీ డైరెక్టర్ కల్యాణ్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, డీఎంహెచ్వో నరేందర్, డీటీడీవో అంబాజీ, బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రితేశ్ పాల్గొన్నారు.
